ఇది నిజమా లేక ? చనిపోయిన పెంపుడు జంతువుల కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు!

ఇది నిజమా లేక  ? చనిపోయిన పెంపుడు జంతువుల కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు!

పెంపుడు జంతువులపై మనుషులకి ఉన్న ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే అవి పెంపుడు జంతువులైన ఇంట్లో ఒక మనిషిలాగే కలిసిపోతాయి. కానీ అదే పెంపుడు జంతువు చనిపోతే చాల బాధగా అనిపిస్తుంది. కొందరైతే అసలు త్వరగా కోలుకోలేరు కూడా...  దీనికి సంబంధించి ఇప్పుడు చైనాలో ఓ పెద్ద స్కాం పుట్టుకొచ్చింది. ఇక్కడి ప్రజలు చనిపోయిన వాళ్ళ పెంపుడు జంతువులతో మాట్లాడాలనే కోరికతో భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వార్తాల్లో ఈ ట్రెండ్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అసలు ఇది నిజమా లేదా ప్రజల బాధను ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్నారా అనేది ఇప్పుడు ప్రశ్న.

చనిపోయిన జంతువులతో మాట్లాడొచ్చని : సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం చైనాలోని కొంతమంది ఆధ్యాత్మిక వైద్యులు అని చెప్పుకుంటూ చనిపోయిన పెంపుడు జంతువుల ఆత్మలను సంప్రదించడంలో  సహాయం చేస్తామని చెప్పుకుంటున్నారు. చాలా మంది పెంపుడు జంతువుల యజమానులు వాళ్ల ఇష్టమైన పెంపుడు జంతువు మరణం తర్వాత చాల నిరాశకు గురవుతారు. ప్రజల ఈ బలహీనతను సద్వినియోగం చేసుకుని పెంపుడు జంతువుతో మళ్ళీ మాట్లాడొచ్చని వారికి హామీ ఇస్తున్నారు.

మీడియా వార్తల ప్రకారం ఈ ఆధ్యాత్మిక వైద్యులు అని పిలిచే వారు సాధారణ లేదా కల్పిత విషయాలను చెప్తూ యజమానులను సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తారు. ఇందుకు వారి నుండి భారీ మొత్తాన్ని వసూలు చేస్తారు. చాలా సందర్భాలలో ఈ మొత్తం వేల యువాన్లకు చేరుకుంటుంది. ఆన్‌లైన్లో కూడా ఈ సేవలకు చాలా డిమాండ్ ఉంది, కానీ క్రమంగా దీనికి సంబంధించి సందేహాలు, వివాదాలు కూడా పెరగడం ప్రారంభించాయి.

పోలీసులకు ఫిర్యాదులు: ఈ కేసులో కొంతమంది పెంపుడు జంతువుల యజమానులు మోసపోయామని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. మా పెంపుడు జంతువు నుండి మాకు నిజమైన అనుభవం లేదని, సాధారణ విషయాలను మాత్రమే విన్నామని వారు చెబుతున్నారు. విచారం, ఒంటరితనంలో ప్రజలు ఇలాంటి పుకార్లు  ఈజీగా నమ్ముతారని నిపుణులు భావిస్తున్నారు. కానీ ఈ మొత్తం విషయం ఇప్పుడు పెద్ద వివాదంగా మారుతుంది.