
చాంగ్జౌ: ఇండియా డబుల్స్ స్టార్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ.. చైనా ఓపెన్ సూపర్–1000 టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మెన్స్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ సాత్విక్–చిరాగ్ 21–18, 21–14తో ఆంగ్ యు సిన్–టియో యి ఈ (మలేసియా)పై గెలిచారు. గతంలో తలపడిన ఆరుసార్లలో విజయాలు సాధించిన ఇండియన్ ద్వయం అదే ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కంటిన్యూ చేసింది. 40 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సాత్విక్ బేస్ లైన్ గేమ్‌తో ఆకట్టుకోగా, చిరాగ్ క్రాస్ కోర్టు, ర్యాలీలతో చెలరేగాడు. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో ఓ దశలో స్కోరు 8–8తో సమమైంది. తర్వాత రెండు జంటలు ఒకటి, రెండు పాయింట్ల తేడాతో ముందుకెళ్లాయి.
ఇక 19–18 స్కోరు వద్ద సాత్విక్ రెండు గేమ్ పాయింట్లను కాపాడుకున్నాడు. రెండో గేమ్ ఆరంభంలో గట్టి పోటీ ఇచ్చిన మలేసియన్ జోడీ చివర్లో తేలిపోయింది. 15–14 స్కోరు వద్ద చిరాగ్–సాత్విక్ వరుసగా ఆరు గేమ్ పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. విమెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో ఉన్నతి హుడా 16–21, 12–21తో వరల్డ్ నాలుగో ర్యాంకర్ అకానె యమగుచి (జపాన్) చేతిలో ఓడింది. జపాన్ ప్లేయర్ వేగానికి ఉన్నతి సరైన స్థాయిలో జవాబివ్వలేకపోయింది.