10 పవర్ సంస్థలు, 2 పోర్టులను టార్గెట్ చేసిన డ్రాగన్ హ్యాకర్లు
పోర్టు నెట్‌వర్క్ వ్యవస్థలో ఓ కనెక్షన్ యాక్టివ్
అమెరికాకు చెందిన రికార్డెడ్ ఫ్యూచర్ సంస్థ వెల్లడి
వాషింగ్టన్: ఇండియన్ పోర్టులు, పవర్గ్రిడ్లే లక్ష్యంగా చైనా హ్యాకర్లు షాడో వార్ చేస్తున్నారు. గతేడాది మే తర్వాతి నుంచి దేశంలోని క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోకి సైబర్ చొరబాట్లు జరుగుతున్నాయని అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘రికార్డెడ్ ఫ్యూచర్’ వెల్లడించింది. ఇండియన్ పోర్టు నెట్‌వర్క్ వ్యవస్థలోకి చైనా ప్రభుత్వంతో సంబంధమున్న హ్యాకర్లు ఎంటర్ అయ్యారని, ఒక కనెక్షన్ ఇప్పటికీ యాక్టివ్‌గా ఉందని హెచ్చరించింది. ఓ వైపు ఎలక్ట్రికల్ సెక్టార్‌లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నాలను ఆఫీసర్లు అడ్డుకుంటున్నా.. మరోవైపు చొరబాట్లకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పింది.
‘హ్యాండ్ షేక్’
చైనాకు చెందిన హ్యాకర్ల గ్రూపు, ఇండియన్ మారీటైమ్ పోర్ట్ మధ్య సమాచార మార్పిడిని సూచించే ‘హ్యాండ్‌షేక్’ను తాము గుర్తించామని రికార్డెడ్ ఫ్యూచర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ స్టువర్ సోలమన్ చెప్పారు. ఫిబ్రవరి 10న ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు తాము సమాచారం ఇచ్చే సమయానికి.. దేశంలోని పవర్‌గ్రిడ్ ఆధీనంలోని 10 సంస్థలను, రెండు మారీటైమ్ పోర్టులను చైనాతో సంబంధమున్న హ్యాకింగ్ గ్రూప్ ‘రెడ్‌ఎకో’ టార్గెట్ చేసినట్టు తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీ దాకా కూడా అవి ఆపరేట్ అవుతున్నాయని చెప్పారు. హ్యాకర్లకు, పోర్టుకు(అటాకర్, అటాకీ) మధ్య ఇప్పటికీ యాక్టివ్ కనెక్షన్ ఉందని, ఇంకా కొనసాగుతోందని హెచ్చరించారు.
మాల్వేర్ పంపి..
పవర్ గ్రిడ్ సిస్టమ్‌లోకి మాల్‌వేర్‌ను పంపి హ్యాకింగ్‌కు పాల్పడ్డట్టు తమ స్టడీలో తేలిందని రికార్డెడ్ ఫ్యూచర్ ఇప్పటికే చెప్పింది. ముంబైలో గతేడాది అకస్మాత్తుగా విద్యుత్ స్తంభించిపోవడం వెనుక వాళ్ల హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ‘రెడ్‌ఎకో’ హ్యాకర్లు విద్యుత్ వ్యవస్థతోపాటు పోర్టులను టార్గెట్ చేసినట్టు గుర్తించామని తెలిపింది. బార్డర్‌లో ఇండియా వెనక్కి తగ్గకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ముంబై పవర్ కట్‌తో చైనా హెచ్చరించి ఉండొచ్చని ఎక్స్పర్టులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న పవర్ సంస్థలను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా హెచ్చరించింది. చైనా హ్యాకర్ల నుంచి థ్రెట్ పొంచి ఉందని, ముందస్తుగా సిస్టమ్స్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలని సూచించింది.
