ఇది అస్సలు ఊహించలే: భారత్‎కు అండగా నిలిచిన చైనా.. ట్రంప్ తీరుపై సీరియస్

ఇది అస్సలు ఊహించలే: భారత్‎కు అండగా నిలిచిన చైనా.. ట్రంప్ తీరుపై సీరియస్

బీజింగ్: ఇరుగుపొరుగు దేశాలైన చైనా-భారత్‎కు మధ్య ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఉప్పునిప్పులాగే వ్యవహరిస్తుంటాయి చైనా-భారత్. మన భూభాగాన్ని అక్రమించడానికి ప్రయత్నించడం, సరిహద్దులో ఆ దేశ సైనికులు కవ్వింపు చర్యలకు దిగడం లేదా భారత చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‎కు చైనా ఆపన్నహస్తం అందించడటంతో ఇరుదేశాల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. డ్రాగన్ కంట్రీ బయటకు బాగానే ఉంటున్న నటిస్తూనే భారత్‎ను ఏదో ఒక ఇరకాటంలో పెట్టాలని చూస్తుంటుంది. ఇలా నిత్యం భారత్‎పై అక్కసు వెళ్లగక్కే చైనా అనుహ్యంగా భారత్‎కు మద్దతుగా నిలిచింది.

 రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుందన్న నెపంతో ఇండియాపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. భారత్‎పై అమెరికా ఏకపక్షంగా టారిఫ్‎లు విధించడాన్ని తీవ్రంగా ఖండించింది చైనా. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రంప్ చర్యను అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం, ప్రపంచ వాణిజ్య స్థిరత్వానికి తీవ్రమైన ముప్పుగా అభివర్ణించారు.

ప్రపంచ నిబంధనలను ఉల్లంఘించే వాణిజ్య విధానాన్ని అమెరికా రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోందని యూఎస్ తీరును తప్పుబట్టారు. కాగా, 2020 జూన్‎లో ఇండియా చైనా బార్డర్‎లోని గాల్వన్ లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో ఇండియా, చైనా సైనికులు మరణించారు. గాల్వన్ లోయ దాడి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఇటీవల కొంచెం సంబంధాలు మెరుగవుతున్నాయి. 

సామరస్యంగా సరిహద్దు సమస్యలు పరిష్కారం కోసం ఇరుదేశాలు నిర్ణయానికి వచ్చాయి. అలాగే.. చైనాలో ఈ నెలలో జరగనున్న ఎస్ఈవో సదస్సు కూడా ప్రధాని మోడీ హాజరుకాబోతున్నారు. గాల్వన్ లోయ సైనిక దాడి తర్వాత మోడీ డ్రాగన్ కంట్రీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇలా మెల్ల మెల్లగా భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. భారత్ అంటేనే అక్కసు వెళ్లగక్కే చైనా అనుహ్యంగా ఇండియాకు మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది.