చైనాలో ఠాగూర్, దంగల్, యోగా చాలా పాపులర్

చైనాలో ఠాగూర్, దంగల్, యోగా చాలా పాపులర్

చైనా కామర్స్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి గావో ఫెంగ్

బీజింగ్: సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ దేశానికి చెందిన మరిన్ని యాప్స్ పై ఇండియా బ్యాన్ విధించింది. దీనిపై చైనా స్పందించింది. 118 చైనా యాప్స్ ను నిషేధించడం ఇండియన్స్ యూజర్లకు ప్రయోజనకరం కాదని, అదే సమయంలో చైనా బిజినెస్ కు కూడా బెనిఫిషియల్ కాదని తెలిపింది. డబ్ల్యూటీవో రూల్స్ ను ఇండియా అతిక్రమించిందని చైనా మండిపడింది. నేషనల్ సెక్యూరిటీకి హాని కలిగిస్తున్నాయని, డేటా ప్రైవసీని దెబ్బ తీస్తున్నాయనే కారణాలతో చైనా యాప్స్ పై బుధవారం ఇండియా బ్యాన్ వేసింది. తాజా బ్యాన్ పై చైనా కామర్స్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి గావో ఫెంగ్ పలు వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో కవి రవీంద్రనాథ్ ఠాగూర్, హిందీ బ్లాక్ బస్టర్ మూవీ దంగల్, యోగా చాలా ఫేమస్ అన్నారు.

‘నేషనల్ సెక్యూరిటీ అనే విధానాన్ని ఇండియా దుర్వినియోగం చేస్తోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తూ చైనా కంపెనీలపై ఇండియా నిషేధం విధించింది. తన తప్పుడు చర్యలను సరి చేసుకోవాలని ఇండియాను చైనా కోరుతోంది. చైనా-ఇండియా వాణిజ్య సహకారం పరస్పరం దోహదం చేస్తుంది. రెండు దేశాలు కూడా ఉమ్మడిగా మంచి సహకారంతో ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ తోపాటు చైనా కంపెనీకు వ్యాపార అవకాశాలను సృష్టించాలి. ఇలాంటి హై టెక్, ఈజీ టూ యూజ్, పాపులర్ యాప్స్ ను బ్యాన్ చేయడం ద్వారా తమ దేశ యూజర్ల ఆసక్తులతోపాటు చైనా కంపెనీలనూ ఇండియా నాశనం చేస్తోంది. ఈ చర్యలతో ఒరిగేదేమీ ఉండదు. యోగాతోపాటు దంగల్ లాంటి ఇండియన్ మూవీస్ చైనాలో చాలా పాపులర్. గొప్ప కవి అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా చైనాలో చాలా ఫేమస్. కాబట్టి ఇండియా ఇరు దేశాల ప్రజలకు ప్రాముఖ్యత ఇస్తుందని ఆశిస్తున్నాం’ అని ఫెంగ్ పేర్కొన్నారు.