- నిర్మాణానికి సిద్ధమైన డ్రాగన్ కంట్రీ
- భారత్‌ను ప్రమాదంలో నెట్టేందుకు ప్లాన్
- ఏఎస్పీఐ రిపోర్ట్‌లో వెల్లడి
న్యూఢిల్లీ: కొద్దిరోజులు సైలెంట్‌గా ఉన్న పొరుగుదేశం చైనా మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది. బ్రహ్మపుత్ర నది భారత్‌లోకి ప్రవేశించే ప్రాంతానికి దగ్గర్లో భారీ జల విద్యుత్కేంద్రం (సూపర్డ్యామ్)ను నిర్మించేందుకు సిద్ధమైంది. ఇది భారత్‌కు తీవ్ర నష్టమని తెలిసినా పొరుగు దేశాన్ని ప్రమాదంలో నెట్టేందుకు జిన్‌పింగ్ సర్కారు ముందుకు కదులుతున్నదని ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్(ఏఎస్పీఐ) ఓ నివేదికలో పేర్కొన్నది. ఈ ప్రాజెక్ట్‌తో భారత్‌కు తీవ్ర ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరించింది.
ఏఎస్పీఐ నివేదికలో ఏం చెప్పింది?
బ్రహ్మపుత్రనది భారత్‌లోకి ప్రవేశించే ముందు అర్ధచంద్రాకారంగా ప్రవహిస్తుంది. గ్రేట్ బెండ్ గా వ్యవహరించే ఈ ప్రాంతంలో నది దాదాపుగా 3000 మీటర్ల మేర కిందికి ప్రవహిస్తుంది. ఈ ప్లేస్ లో విద్యుత్ కేంద్రం నిర్మిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని చైనా భావిస్తోంది. డ్యామ్ పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోపవర్ ప్రాజెక్ట్‌గా మారుతుందని చెబుతోంది.
భారత్‌కు పెనుప్రమాదం
బ్రహ్మపుత్ర నదిపై భారత్, చైనా మధ్య చరిత్రాత్మక ఒప్పందం ఉంది. ఈ నదీజలాలపై 2002లో తొలిసారిగా 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిప్రకారం ఈ నదికి సంబంధించిన ప్రతి విషయాన్ని భారత్‌కు చైనా వెల్లడించాలి. చాలా ఏండ్లుగా కొనసాగిన ఈ ఒప్పందం 2023తో ముగిసింది. తర్వాత ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు. ఈ నేపథ్యంలో చైనా సూపర్ డ్యామ్‌ను నిర్మాణానికి పూనుకోవడం భారత్‌ను టెన్షన్పెడుతోంది. ఈ డ్యామ్ భారత్పాలిట పెనుముప్పుగా మారనున్నది. ఒకవేళ చైనా పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే అరుణాచల్ ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతాయి. చైనా దీనిని వాటర్ బాంబ్‌గా ఉపయోగించుకునే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.