తైవాన్ను మిస్హ్యాండిల్ చేస్తే ఘర్షణలు తప్పవ్.. అమెరికాకు చైనా హెచ్చరిక

తైవాన్ను మిస్హ్యాండిల్ చేస్తే ఘర్షణలు తప్పవ్.. అమెరికాకు చైనా హెచ్చరిక
  • యూఎస్, చైనా మధ్య సంఘర్షణకు బదులు సహకారం ఉండాలని పిలుపు
  • జిన్​పింగ్ గొప్ప లీడర్.. తనకు మిత్రుడు అని ట్రంప్ ప్రశంసలు 
  • బీజింగ్​లో జిన్​పింగ్, ట్రంప్ భేటీ
  • హార్మూజ్​ను రీఓపెన్ చేయాలని ఇరుదేశాల అభిప్రాయం

బీజింగ్:చైనాతో తైవాన్ వివాదాన్ని అమెరికా తప్పుగా హ్యాండిల్ చేస్తే ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంటుందని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌‌‌‌ను చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ హెచ్చరించారు. రెండు రోజుల చైనా పర్యటన కోసం బుధవారం బీజింగ్ చేరుకున్న ట్రంప్ కు జిన్ పింగ్ ఘనంగా స్వాగతం పలికారు. ఇరువురు నేతలు గురువారం బీజింగ్ లో సుమారు రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో మొదటి విడత చర్చలు జరిపారు. ఇరాన్ యుద్ధం, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇంధన భద్రత, ఇరుదేశాల సంబంధాలు, వాణిజ్యంపై వీరు చర్చించారు. 

ఈ సందర్భంగా జిన్ పింగ్ మాట్లాడుతూ.. చైనా, -అమెరికా సంబంధాలలో తైవాన్ అత్యంత ముఖ్యమైన అంశంగా ఉందని నొక్కి చెప్పారని ఈ మేరకు చైనా అధికారిక వార్తా సంస్థ ‘సిన్హువా’ వెల్లడించింది. ‘‘తైవాన్ అంశాన్ని సరిగ్గా హ్యాండిల్ చేస్తే, ద్వైపాక్షిక సంబంధాలు స్థిరంగా ఉంటాయి. లేనిపక్షంలో, ఇరు దేశాలు ఘర్షణలు, చివరకు సంఘర్షణలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇది ద్వైపాక్షిక సంబంధాలను గొప్ప ప్రమాదంలోకి నెట్టేస్తుంది” అని జిన్ పింగ్ హెచ్చరించారని పేర్కొంది. అందుకే తైవాన్ అంశాన్ని హ్యాండిల్ చేయడంలో అమెరికా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారని తెలిపింది.

  • హార్మూజ్ రీఓపెన్​పై ఏకాభిప్రాయం.. 

బీజింగ్​లో జరిగిన భేటీలో చైనా, అమెరికా మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, ఇరాన్ అణు ఆయుధాలను పొందకుండా నిరోధించడం గురించి జిన్ పింగ్, ట్రంప్ చర్చించారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచ ఇంధన అవసరాలకు మద్దతుగా హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచాలనే విషయంలో ఇద్దరు నాయకులు ఏకీభవించారని తెలిపింది. 

ఇరాన్ అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదని రెండు దేశాలు అంగీకరించాయని వెల్లడించింది. అమెరికాలోకి ఫెంటానిల్ డ్రగ్ రసాయనాల ప్రవాహాన్ని అరికట్టడంలో సాధించిన పురోగతిపైనా చర్చించారని తెలిపింది. కాగా, సెప్టెంబర్ 24న వైట్ హౌస్‌‌‌‌కు రావాలని జిన్ పింగ్, ఆయన భార్యను ట్రంప్ ఆహ్వానించారని వైట్​హౌస్ తెలిపింది. కాగా, ట్రంప్ 2017లో తన మొదటి పదవీకాలంలో చివరిసారిగా చైనాను సందర్శించారు. శుక్రవారం మధ్యాహ్నం ట్రంప్ అమెరికాకు బయలుదేరనున్నారు.

  • జిన్ పింగ్‌‌‌‌ గొప్ప లీడర్: ట్రంప్ 

జిన్ పింగ్‌‌‌‌ గొప్ప నాయకుడు అని ట్రంప్ కొనియాడారు. చైనాతో అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చలకు ముందు తన ప్రారంభ ప్రసంగంలో, చైనా అధ్యక్షుడిని కలవడం గౌరవంగా భావిస్తున్నానని, ఆయనను తన మిత్రుడని పిలుస్తానని ట్రంప్ చెప్పారు. ‘మేం కలిసి పనిచేశాం. ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించుకున్నాం. నేను మీకు ఫోన్ చేసేవాడిని, మీరు నాకు ఫోన్ చేసేవారు. ప్రజలకు తెలియదు కానీ, మాకు సమస్య ఎదురైనప్పుడల్లా మేం దానిని చాలా త్వరగా పరిష్కరించుకునేవాళ్లం’ అని ఆయన చెప్పారు. 

‘మీరు గొప్ప నాయకుడు, కొన్నిసార్లు నేను ఇలా చెప్పడం ప్రజలకు నచ్చదు, కానీ అది నిజం కాబట్టి నేను చెబుతాను. మీతో ఉండటం.. మీ మిత్రుడిగా ఉండటం గౌరవంగా ఉంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. జిన్ పింగ్‌‌‌‌తో తనకు గతంలో ఎదురైన ఇబ్బందులను కూడా ట్రంప్ ప్రస్తావించారు. వాటిలో వాణిజ్య యుద్ధాలు, తైవాన్‌‌‌‌కు అమెరికా మద్దతు విషయంలో ఉద్రిక్తతలు, ఫెంటానిల్ రసాయనాల సప్లయ్ విషయంలో ట్రంప్ అసహనం వంటివి ఉన్నాయి. అయితే, ఇరాన్ యుద్ధం విషయంలో ఉన్న విభేదాలను ఆయన ప్రస్తావించలేదు. 

  • సంఘర్షణ కాదు.. సహకారం ఉండాలి: జిన్ పింగ్   

జిన్ పింగ్ తన ప్రసంగంలో చైనా, అమెరికా మధ్య సంఘర్షణకు బదులు సహకారం ఉండాలని పిలుపునిచ్చారు. ప్రపంచం శతాబ్దంలో ఎన్నడూ చూడని మార్పును ఎదుర్కొంటోందని, ప్రపంచ అనిశ్చితి మధ్య చైనా, -అమెరికా సంబంధాల స్థిరత్వం ముఖ్యమని నొక్కి చెప్పారు. అమెరికా, -ఇరాన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, ‘చైనా, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త విధానాన్ని సృష్టించగలవా? మనం కలిసి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొని, ప్రపంచానికి మరింత స్థిరత్వాన్ని అందించగలమా?’ అని అడిగారు. ‘ప్రధాన దేశాల నాయకులుగా మీరు, నేను సమాధానం చెప్పాల్సిన మన కాలపు ప్రశ్నలు ఇవి’ అని అన్నారు.