గాల్వాన్ ఘర్షణ దురదృష్టకరం: చైనా రాయబారి సన్ వీడాంగ్

గాల్వాన్ ఘర్షణ దురదృష్టకరం: చైనా రాయబారి సన్ వీడాంగ్

భారత సైనికులు 20 మందిని పొట్టన పెట్టుకున్న గాల్వాన్ ఘటనపై చైనా స్పందించింది. ఘర్షణ జరిగిన రెండు నెలల తర్వాత చైనా పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. గాల్వాన్ ఘర్షణను దురదృష్టకరమైన సంఘటనగా వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలు జరగాలని భారత్, చైనా దేశాలు కోరుకోవడం లేదని భారత్ లోని చైనా రాయబారి సన్ వీడాంగ్ ప్రకటించారు. ఆగస్టు 18న నిర్వహించిన ‘ఇండియా-చైనా యూత్ ఫోరం’ వెబినార్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు చైనా రాయబార కార్యాలయం తెలిపింది.

ఓ వైపు సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తూ.. మరోవైపు బలగాల ఉపసంహరణ కోసం చర్చలు జరుపుతున్న చైనా.. భారత్‌తో దోస్తీ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌ను చైనా ప్రత్యర్థిగా కాకుండా ఓ మిత్ర దేశంగా, ముప్పుగా కాకుండా ఓ అవకాశంగా భావిస్తున్నామన్నారు వీడాంగ్. గాల్వాన్ లాంటి దురదృష్టకర ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు వీడాంగ్.