లడఖ్‌‌ పవర్‌‌‌‌ గ్రిడ్‌‌పై చైనా హ్యాకర్ల దాడులు

లడఖ్‌‌ పవర్‌‌‌‌ గ్రిడ్‌‌పై చైనా హ్యాకర్ల దాడులు

న్యూఢిల్లీ: లడఖ్‌‌లోని కరెంటు పంపిణీ కేంద్రాలను గత 8 నెలలుగా చైనా హ్యాకర్లు టార్గెట్ చేశారని ప్రైవేటు నిఘా సంస్థ ‘రికార్డెడ్ ఫ్యూచర్’ వెల్లడించింది. ‘‘ఏడు స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ల (ఎస్‌‌ఎల్‌‌డీసీ)లను లక్ష్యంగా చేసుకుని కొన్ని నెలలుగా నెట్‌‌వర్క్ లోకి జరిగిన చొరబాట్లను మేం గమనించాం. జియోగ్రాఫికల్‌‌గా వీటిని టార్గెట్ చేశారు. నార్త్ ఇండియాలో, అది కూడా లడఖ్‌‌లో వివాదాస్పద ఇండియా, -చైనా సరిహద్దుకు దగ్గర్లో ఈ ఎస్‌‌ఎల్‌‌డీసీలు ఉన్నాయి” అని చెప్పింది. హ్యాకర్లు కీలక ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ సమాచారాన్ని సేకరించి.. భవిష్యత్‌‌లో వాడుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నిరుడు ఆగస్టు నుంచి ఈ ఏడాది మార్చి దాకా ఈ అటాక్స్ జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న చైనా ప్రభుత్వ సహకారం ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్లకు, ఇండియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ల మధ్య సమాచార మార్పిడి జరిగినట్లు దర్యాప్తులో కనుగొన్నట్లు చెప్పాయి. పవర్‌‌‌‌ గ్రిడ్‌‌తో పాటు మరికొన్ని వ్యవస్థలకు కూడా చైనా హ్యాకర్ల నుంచి ముప్పు ఉందని రికార్డెడ్ ఫ్యూచర్ హెచ్చరించింది. ఈ రిపోర్టు ప్రచురించడానికి ముందే.. తాము కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసినట్లు వెల్లడించింది. ముందు ‘రెడ్ ఎకో’, తర్వాత ‘టాగ్ 38’ హ్యాకర్లు.. కొన్ని నెలలుగా దేశంలోని రాష్ట్ర, ప్రాంతీయ లోడ్ డెస్పాచ్ సెంటర్లపై అటాక్స్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే, చైనా హ్యాకర్లు ఎంత ప్రయత్నించినా మన నెట్‌‌వర్క్‌‌ను హ్యాక్ చేయలేపోయారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ‘‘లడఖ్‌‌కు దగ్గర్లలో కరెంటు పంపిణీ సంస్థలను టార్గెట్‌‌గా చేసుకుని రెండు ప్రయత్నాలు జరిగాయి. కానీ వాళ్లు సక్సెస్ కాలేదు. ఇలాంటి సైబర్ దాడులను అడ్డుకునేందుకు మా డిఫెన్స్ సిస్టమ్‌‌ను బలోపేతం చేశాం” అని విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు.