
ఫేక్ కంపెనీలతో రూ.50 కోట్ల భారీ ఇన్వెస్ట్ మెంట్ స్కామ్
హైదరాబాద్, వెలుగు:
‘మూడు వందల నుంచి ముప్పై వేల దాకా.. ఎంతన్నా పెట్టుబడి పెట్టండి. 15 రూపాయల వడ్డీతో కలిపి ఇస్తాం. 90 రోజుల్లో నాలుగింతలు చేస్తాం..’ అంటూ ఇద్దరు చైనీయులు ఏకంగా 20 వేల మందికి టోకరా వేశారు! ఫేక్ కంపెనీలు క్రియేట్ చేసి.. మన దేశానికి చెందిన ముగ్గురిని నియమించుకుని భారీ ఇన్వెస్ట్ మెంట్ స్కామ్ చేశారు. 3 రకాల స్కీమ్ లు పెట్టి.. మొదట్లో డిపాజిటర్లకు బాగా డబ్బులు ఇచ్చారు. జనం నమ్మడం మొదలుపెట్టినంక భారీగా డిపాజిట్లు చేయించుకుని, దందాను క్లోజ్ చేశారు. మొత్తంగా 20 వేల మంది నుంచి రూ. 50 కోట్లు వసూలు చేసిన ఈ మనీ స్కాంను సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. స్కామ్ లో చైనీయులకు సహకరించిన ముగ్గురిని ఆదివారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు చైనీయుల కోసం లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. సోమవారం సైబరాబాద్ సీపీ సజ్జనార్ కేసు వివరాలను వెల్లడించారు. 10 బ్యాంక్ అకౌంట్స్‌లోని రూ.3 కోట్ల క్యాష్ ను ఫ్రీజ్ చేశామని ఆయన తెలిపారు. 4 ల్యాప్ టాప్స్,సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
భారీగా వడ్డీ ఆశ చూపి.. ఇలా స్కెచ్ వేసిండ్రు..
హర్యానాలోని గురుగావ్ కి చెందిన ఉదయ్ ప్రతాప్(41) నాలుగేండ్లుగా చైనాకు చెందిన టాప్‌వన్ మొబి టెక్నాలజీ లిమిటెట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చైనాకు చెందిన పెంగ్ గువేయి అలియాస్ జేవీతో అతడికి పరిచయమైంది. ఇద్దరు కలిసి టెలికాం వ్యాల్యూ యాడెడ్ సర్విసెస్‌లో వర్క్ చేశారు. ఆ తర్వాత మరో చైనా దేశస్థుడు ఝాంగ్ హాంగ్వేయి అలియాస్ పీటర్(38), ఢిల్లీలోని ద్వారకకు చెందిన నితీశ్ కుమార్ కొఠారీ(36), గుర్‌గావ్‌కి చెందిన రాజేశ్ శర్మ(36)తో కలిసి కంపెనీస్‌కి ప్లాన్ చేశారు. 2017లో మొబిసెంట్రిక్ టెక్నాలజీస్ అడ్‌స్టక్ కన్సల్టింగ్ ఇన్ సర్వీసెస్ ను ఏర్పాటు చేశారు. గతేడాది జనవరిలో చైనాకు వెళ్ళిన ఇద్దరు చైనీయులు లాక్‌డౌన్ తో అక్కడే చిక్కుకుపోయారు. ఇండియాలోని ఉదయ్ ప్రతాప్‌తో వాట్సాప్,స్కైప్‌లో కాంటాక్ట్ అయ్యారు. చైనీయుల డైరెక్షన్‌లో పాండా ఓవర్‌సీస్ లిమిటెడ్‌కి ఉదయ్ ప్రతాప్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో స్మాల్ ఇన్వెస్ట్‌మెంట్స్,బెస్ట్ ఇంట్రెస్ట్ పేరుతో ఇండియన్స్‌ను ట్రాప్ చేయాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం ‘www.ciciseo.com’, ‘షేర్ డ్ బీకే యాప్’ పేరుతో లింక్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇన్వెస్ట్ చేసిన వారికి కేవలం 90 రోజుల్లోనే ఎక్కువ లాభాలు రిటర్న్స్ చేస్తామని ప్రచారం చేశారు. కస్టమర్ల పర్సనల్ డీటెయిల్స్,బ్యాంక్ అకౌంట్స్ కలెక్ట్ చేశారు.
చైన్ సిస్టమ్‌లా సర్క్యులేట్
5 –11 శాతం ఇంట్రెస్ట్ ఇస్తామని చైన్ సిస్టమ్‌లో సర్క్యులేట్ చేశారు. గుర్‌గావ్ అడ్డాగా 2 ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేశారు. 90 రోజుల డెడ్‌లైన్ పీరియడ్‌తో 3 రకాల స్కీమ్స్ క్రియేట్ చేశారు. ఫస్ట్ స్కీమ్‌లో రూ.300 ఇన్వెస్ట్ చేస్తే రోజుకు రూ.15 ఇంట్రెస్ట్‌తో 90 రోజుల్లో మొత్తం రూ.1,350, రెండో స్కీమ్ లో రూ.3 వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.13, 500, మూడో స్కీమ్‌లో రూ.15వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.67 ,500 డిపాజిట్ చేస్తామని అట్రాక్ట్ చేశారు. ఇలా రూ.300 తో స్టార్ట్ చేసిన వారిని రూ.30వేలు డిపాజిట్ చేసేలా ఆఫర్స్ ఇచ్చారు. కలెక్ట్ చేసిన డబ్బును ఇండియన్ కంపెనీల పేర్లతో ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేవారు.
8 ఫేక్ కంపెనీలు
హైదరాబాద్‌లో మొబీసెంట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరులో ఆలీదాదా, గోల్డ్‌టెక్, కాన్పూర్‌లో అషేన్ ఫలౌస్, బ్రిడ్జి తేరా, టోనింగ్ వరల్డ్ ఇంటర్నేషనల్ టెక్నాలజీస్, ఢిల్లీలో టెచ్‌డింగ్ ఫిన్‌టెక్, పుణేలో సైబర్‌టెల్ ఇన్ఫోటెక్ పేర్లతో ఫేక్ కంపెనీలను వీరు రిజిస్టర్ చేయించారు. వీటితో జరిగే మనీ ట్రాన్సాక్షన్లను చైనా వెబ్ సైట్లు రియల్ మనీ రమ్మీ.కామ్, మ్యాంగకింగ్‌డమ్.హెచ్‌టీఎంఎల్, 51 సైబర్ టెల్.కామ్‌ల ద్వారా నిర్వహించారు. రేజర్ పే పేమెంట్ గేట్ వే ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేశారు. నాలుగేండ్లుగా నడుస్తున్న ఈ దందా కరోనా తో గతేడాది జనవరి 25 నుంచి షట్ డౌన్ అయ్యిందని పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. రాయదుర్గం పీఎస్‌లో రిజిస్టరైన కేసు ఆధారంగా సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ దర్యాప్తు చేసింది. స్కామ్‌కు పాల్పడిన నిందితులు ఉదయ్ ప్రతాప్, నితీష్‌కుమార్ కొఠారీ, రాజేశ్ శర్మను అరెస్ట్ చేసింది. ఇద్దరు చైనీయుల కోసం లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది.
డౌట్ వస్తే ఇన్ఫామ్ చేయండి
తక్కువ ఇన్వెస్ట్ మెంట్ తో ఎక్కువ లాభం వస్తుందని చెప్పేవారి మాటలు నమ్మొద్దు. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే లింక్స్ ను క్లిక్ చేయొద్దు. ఎకనామిక్ అఫెన్సెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆన్ లైన్ మోసాల గురించి ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందించాలి. – సజ్జనార్, సీపీ, సైబరాబాద్