యుద్ధం చేయాల్సి వస్తే మీరు సిద్ధమేనా?: చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్​

యుద్ధం చేయాల్సి వస్తే మీరు సిద్ధమేనా?: చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్​
  •     తాజా కూరగాయలు అందుతున్నాయా అంటూ ఆరా
  •     సరిహద్దులను కాపాడుతున్న హీరోలంటూ పొగడ్తలు
  •     24 గంటలూ గస్తీ కాస్తున్నామని ప్రెసిడెంట్​ కు చెప్పిన సోల్జర్లు

బీజింగ్: ‘ఇటీవలి కాలంలో బార్డర్​లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని తెలుస్తోంది.. ఇప్పుడు అక్కడ ఎలా ఉంది? ఒకవేళ ఇప్పటికిప్పుడు యుద్ధం చేయాల్సి వస్తే మీరు సిద్ధమేనా?’ అంటూ చైనా ప్రెసిడెంట్​ జిన్​ పింగ్​ పీపుల్స్ లిబరేషన్​ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులను ఆరాతీశారు. బార్డర్​లో గస్తీ కాస్తున్న సైనికులతో జిన్​ పింగ్​ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సైనికుల యుద్ధ సన్నద్ధతను, వారికి అందుతున్న రేషన్​ తదితర వివరాలను ఆరా తీశారంటూ చైనా అధికార మీడియా శుక్రవారం వెల్లడించింది. అయితే, జిన్​ పింగ్​ వీడియో కాల్​ వెనకున్న ఉద్దేశంపై నిపుణులలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బార్డర్​ లో ఉన్న సైనికులు యుద్ధానికి రెడీగా ఉన్నారో లేదో విచారించడం ద్వారా పొరుగున ఉన్న దేశాలకు పరోక్షంగా హెచ్చరిక చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదీ తూర్పు లడాఖ్ వెంబడి ఉన్న ఇండియా సరిహద్దుల్లో డ్యూటీ చేస్తున్న సైనికులతో జిన్​ పింగ్​ మాట్లాడడంతో ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రేషన్​ సరిగ్గా అందుతోందా..

సరిహద్దులలోని వాతావరణం కారణంగా నిత్యావసరాల రవాణా చాలా కష్టమవుతుందని చైనా ప్రెసిడెంట్​ జిన్​ పింగ్​ పేర్కొన్నారు. ఇప్పుడు మీకు తాజా కూరగాయలు అందుతున్నాయా లేదా అని సైనికుల వద్ద ఆరా తీశారు. ఈమేరకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ హెడ్డాఫీసుకు చేరుకున్న జిన్​ పింగ్..  అక్కడి నుంచే వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద విధినిర్వహణలో ఉన్న సైనికులతో వీడియో కాల్​ ద్వారా మాట్లాడారు. డ్యూటీలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిన్​ పింగ్​ వారికి సూచించారు. ఎల్ఏసీ వెంబడి ఉన్న ఖుంజెరాబ్​ ఏరియాలో పరిస్థితిని సైనికులను అడిగి తెలుసుకున్నారు. బార్డర్​ను కాపాడడంలో నిజమైన హీరోలు మీరేనంటూ సైనికులపై పొగడ్తలు కురిపించారు. కాగా, ప్రెసిడెంట్​ ప్రశ్నకు ఓ సైనికుడు జవాబిస్తూ.. బార్డర్​ వెంట 24 గంటలూ గస్తీ కాస్తున్నట్లు చెప్పాడు. 

ఇండియన్​ సోల్జర్లతో గొడవపడింది ఇక్కడే..

2020 మే 5న లడాఖ్ బార్డర్​లో ఇండియా–చైనా సైనికుల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే! పాంగాంగ్​ సరస్సు ఒడ్డున జరిగిన ఈ గొడవలో చైనా సైనికులు పెద్ద సంఖ్యలో మరణించారని వార్తలు వెలువడ్డాయి. అయితే, జిన్ పింగ్​ ప్రభుత్వం మాత్రం తమవైపు ప్రాణనష్టం తక్కువేనని ప్రకటించింది. ఈ గొడవ తర్వాత రెండు దేశాల మధ్య 17  దఫాలుగా ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఈ ఏరియాలో టెన్షన్లు పూర్తిగా చల్లారలేదు. తాజాగా ఇక్కడ విధుల్లో ఉన్న సైనికులతోనే చైనా ప్రెసిడెంట్​ జిన్ పింగ్ మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది.