కరోనాకు 33 రూపాలు..మనిషికి సోకేవి 7 కరోనాలు

కరోనాకు 33 రూపాలు..మనిషికి సోకేవి 7 కరోనాలు

వెలుగు, సెంట్రల్ డెస్క్ హెచ్ ఐవీలాగానే మహమ్మారి కరోనా వైరస్  రూపు మార్చుకుంటోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇప్పటికే 33 స్ట్రెయిన్లకు మారిపోయి అంతుపట్టకుండా తయారవుతోంది. ట్రీట్ మెంట్ ను కఠినతరం చేస్తూ మరింత మందిని బలి తీసుకుంటోంది. కేవలం 11 మంది పేషెంట్లపై చైనా సైంటిస్టులు ప్రయోగాలు చేసి ఈ విషయాన్ని నిర్ధారించారు. స్ట్రెయిన్ ను బట్టి దాని ముప్పు ఎక్కువగా ఉంటోందని తేల్చారు. యూరప్ , అమెరికా, బ్రిటన్ , నెదర్లాండ్స్ లలో ఆ స్ట్రెయిన్ల వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారని నిర్ధారించారు. ఒక స్ట్రెయిన్  అయితే మామూలు స్ట్రెయిన్ తో పోలిస్తే 270 రెట్లు ఎక్కువ ఇన్ ఫెక్షన్ కు కారణమవుతోందని తేల్చి చెప్పారు. జర్మనీ సహా కొన్ని దేశాల్లోని ఇన్ ఫెక్షన్లు తక్కువ ముప్పు ఉన్న స్ట్రెయిన్లవేనన్నారు. ఝెజియాంగ్  యూనివర్సిటీ సైంటిస్టులు ఈ స్టడీ చేశారు.

ఝెజియాంగ్ లో డేంజరస్  స్ట్రెయిన్లు

11 మంది పేషెంట్ల నుంచి తీసుకున్న కరోనా వైరస్  శాంపిళ్లను సైంటిస్టులు టెస్ట్  చేశారు. ఆయా పేషెంట్లలో కరోనా వైరస్ కు సంబంధించి 33 స్ట్రెయిన్లున్నట్టు నిర్ధారించారు. వైరస్ కు సంబంధించిన 725 జీనోమ్ లపై పరీక్షలు చేసి ఆ నిర్ధారణకు వచ్చారు. వాటిలో 10 ఇంతకుముందే ఉన్న స్ట్రెయిన్లు కాగా, 19 స్ట్రెయిన్లు కొత్తవని తేల్చారు. కొన్ని స్ట్రెయిన్లతో ప్రమాదం ఉంటుందని గుర్తించారు.  ఝెజియాంగ్ కు చెందిన పేషెంట్లలో ఉన్న స్ట్రెయిన్లు మరింత ప్రమాదకరంగా ఉన్నాయని తేల్చారు. ఆ స్ట్రెయిన్లే వైరస్  ప్రభావం ఎక్కువగా ఉన్న ఇటలీ, స్పెయిన్ , న్యూయార్క్ లోనూ ఇన్ ఫెక్షన్ కు కారణమైనట్టు చెబుతున్నారు. వాషింగ్టన్  సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న స్ట్రెయిన్లు తక్కువ ప్రమాదమైనవేనని అంటున్నారు. అయితే, వుహాన్ లో వైరస్  స్ట్రెయిన్  ఏంటన్నది సైంటిస్టులు తేల్చ లేకపోతున్నారు.

ట్రీట్ మెంట్ కు కీలకం

వైరస్  రూపు మార్చుకుంటుండడం వల్ల అది మరింత ప్రమాదకరంగా మారుతోందని స్టడీకి నేతృత్వం వహించిన ఝెజియాంగ్  యూనివర్సిటీ రీసెర్చర్ , ఎపిడెమియాలజిస్ట్  లి లాంజువాన్  చెప్పారు. వైరస్  మ్యుటేట్  అవుతుండడం, వ్యాక్సిన్ల తయారీపై ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు. కాబట్టి వైరస్  మ్యుటేషన్ కు తగ్గట్టు మందులు, ట్రీట్ మెంట్  చేయాల్సిన అవసరముందని ఆయన చెబుతున్నారు. మనిషి ఒంట్లోకి వైరస్  ప్రవేశించాక తన కణాల్లోనూ మార్పులు చేసుకుంటున్నట్టు గుర్తించారు. మన ఒంట్లోని ఆరోగ్యవంతమైన కణాలను అవి చంపేస్తున్నట్టు టెస్టుల్లో తేల్చారు.

ఇవీ స్ట్రెయిన్లు

సీ241టీ, సీ14408టీ, ఏ23403జీ (డీ614జీ), సీ8782టీ, టీ28144సీ (ఎల్ 84ఎస్ కి సబ్ స్ట్రెయిన్ ), జీ11083టీ (ఎల్ 3606ఎఫ్ కు సబ్ స్ట్రెయిన్), జీ26144టీ (ఓఆర్ ఎఫ్ ఏ3 జీన్ లోని జీ251వీకి సబ్ స్ట్రెయిన్), ఎస్ 247ఆర్ , టీ22303జీ, ఏ22301సీ, ఆర్ ఏటీజీ13, జీ1937ఏ (ఓఆర్ ఎఫ్ 1ఏ జీన్ లోని వీ3781కు సబ్ స్ట్రెయిన్ ), జీ1440ఏ, జీ2891ఏ (ఈ రెండు కలిసి జీ392డీ అనే స్ట్రెయిన్ గా మారాయి), ఏ876టీ, సీ15325టీ, సీ29303టీ, జీ28881ఏ, జీ2882ఏ, జీ28883సీ, పీ344ఎస్.

ఇండోర్  స్ట్రెయిన్  డేంజర్

మన దేశంలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్  స్ట్రెయిన్  చాలా డేంజర్  అని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. ఆ సిటీలోనే 57 మంది దాకా చనిపోయారు. దీంతో సైంటిస్టులు వాళ్ల శాంపిళ్లను టెస్ట్  చేయించేందుకు నేషనల్  ఇనిస్టిట్యూట్  ఆఫ్  వైరాలజీ (ఎన్ ఐవీ)కి పంపించారు. ఆ వైరస్  జీనోమ్ ను టెస్టులు చేస్తే ఆ స్ట్రెయిన్  ఏంటన్నది తెలుస్తుందని ఇండోర్ లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) డీన్  జ్యోతి బిందాల్  చెప్పారు. ఇప్పటిదాకా కరోనా వైరస్  టెస్టులతోనే సరిపెడుతున్నామని, ఇకపై వైరస్  స్ట్రెయిన్ నూ తేల్చాల్సిన అవసరముందని ఆమె అన్నారు. సిటీలో ఎక్కువ మరణాలకు కారణమేంటన్నది తేల్చేందుకు వైరల్  కల్చర్ , ఆర్ ఎన్ ఏఎక్స్ ట్రాక్షన్  చేసి నిర్ధారించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ అధీనంలోని స్కూల్  ఆఫ్  ఎక్స్ లెన్స్  ఇన్  పల్మనరీ మెడిసిన్  డైరెక్టర్  జితేంద్ర భార్గవ చెప్పారు. వైరస్  రూపు మార్చుకుంటుండడం వల్ల అన్ని స్ట్రెయిన్లకు కలిపి ఒకే వ్యాక్సిన్  తయారు చేయడమన్నది కష్టమైన పని అని ఆయన చెప్పారు.

గుజరాత్ లో వుహాన్  స్ట్రెయిన్

గుజరాత్ లో ఎక్కువ మరణాలు వుహాన్ లో ఇన్ ఫెక్షన్లకు కారణమైన ఎల్  స్ట్రెయినే అని సైంటిస్టులు అంటున్నారు. ఎస్  స్ట్రెయిన్ తో పోలిస్తే ఎల్  స్ట్రెయిన్ తోనే ఎక్కువ మంది చనిపోతున్నట్టు కరోనా ట్రీట్ మెంట్ కు అనుమతి పొందిన స్టెర్లింగ్  హాస్పిటల్  ఇన్ ఫెక్షియస్  డిసీజ్  స్పెషలిస్ట్  డాక్టర్  అతుల్  పటేల్  చెప్పారు. కేరళలో మరణాలు తక్కువగా ఉండడానికి కారణం ఎస్  స్ట్రెయినేనన్నారు. అక్కడకు దుబాయ్  నుంచి చాలా మంది వచ్చారని, వాళ్లకు ఉన్నది ఎస్  స్ట్రెయిన్  అని చెప్పారు. సీఎం విజయ్ రూపానీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేరళ సర్కారు మెడికల్  అడ్వైజర్ తో నేను మాట్లాడాను. అక్కడి పేషెంట్లలో ఎక్కువ మంది దుబాయ్  నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఎల్, ఎస్ అనే రెండు రకాల స్ట్రెయిన్లను కేరళలో గుర్తించారు. వుహాన్  ఇన్ ఫెక్షన్లకు కారణం ఎల్  స్ట్రెయిన్ . అదే చాలా డేంజర్ . ఆ స్ట్రెయిన్  ఉన్నోళ్లు తొందరగా చనిపోతున్నారు. ఇటలీ, ఫ్రాన్స్ , అమెరికాల్లో ఎల్  స్ట్రెయిన్ తో మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పారు.

సార్స్ కు హెచ్ ఐవీ ఎక్కించారా?

ఇటీవల ఫ్రాన్స్ కు చెందిన నోబెల్  విన్నర్  ల్యూక్  మోంటేనర్ .. వైరస్  వుహాన్  ల్యాబ్ లోనే తయారు చేశారని చెప్పారు. హెచ్ ఐవీని గుర్తించిన సైంటిస్టుల్లో ఆయన కూడా ఒకరు. ఈ కొత్త కరోనా వైరస్ లో హెచ్ ఐవీ జీన్స్  కూడా ఉన్నాయని ఆయన బాంబ్  పేల్చారు. ఎయిడ్స్ కు వ్యాక్సిన్  కనిపెట్టే ప్రయత్నంలో భాగంగా 2003లో పుట్టిన సార్స్  వైరస్ కు హెచ్ ఐవీ జీన్ ను కలిపారన్నారు. అయితే, అది బెడిసి కొట్టి ఈ కొత్త వైరస్  పుట్టుకొచ్చిందన్నారు. అది కాస్తా ల్యాబ్  నుంచి బయటకు లీకైందన్నారు. ఇప్పుడు కరోనా రూపు మార్చుకుంటుండడంతో ఆయన అన్న మాటలను కొందరు సైంటిస్టులు గుర్తు చేస్తున్నారు. ఇన్ని స్ట్రెయిన్లు పుడుతున్నాయంటే అందులో హెచ్ ఐవీ జీన్స్  ఉండే ఉంటాయని చెబుతున్నారు. అదే నిజమైతే వైరస్  మరింత ప్రమాదకరంగా మారే ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొందరు సైంటిస్టులు మాత్రం మోంటేనర్​ మాటలను కొట్టిపారేస్తున్నారు.

మనిషికి సోకేవి 7 కరోనాలు

నిజానికి ఈ కరోనా వైరస్  ఒంటరిది కాదు. దాని ఫ్యామిలీలో ఎన్నో వైరస్ లున్నాయి. అందులో ఏడు మాత్రమే మనకు సోకుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. తొలిసారిగా 1937లోనే కరోనా వైరస్ ను సైంటిస్టులు గుర్తించారు. దాన్నే ఇన్ ఫెక్షియస్  బ్రాంకైటిస్  వైరస్ (ఐబీవీ) అని పిలిచారు. దానితో మనుషులకు పెద్దగా ముప్పు లేదు. మనుషులను ఎఫెక్ట్  చేసే కరోనా జాతులను తొలిసారిగా 1966లో గుర్తించారు. నాలుగు సబ్  గ్రూపులుగా డివైడ్  చేశారు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టాగా క్లాసిఫై చేశారు. అందులో ఆల్ఫా, బీటాలే మనిషికి సోకేవని నిర్ధారించారు. ఇవీ మనకు అంటుకునే కరోనాలు..

229ఈ: ఇది ఆల్ఫా గ్రూపునకు చెందినది. 1966లో డీ హామ్రే, జేజే ప్రాక్నోలు దానిని గుర్తించినట్టు చెబుతారు.

ఓసీ43: ఇది బీటా గ్రూప్  కరోనా. 1967లో ఇది బయటి ప్రపంచానికి తెలిసింది. టైరెల్ , బైనో అనే ఇద్దరు సైంటిస్టులు కనిపెట్టారు. 1965లోనే ఇది మనుషులకు సోకిందని అంటారు. ఇదే మనిషికి సోకిన తొలి కరోనా వైరస్  అనీ చెబుతారు.

ఎన్ ఎల్ 63, హెచ్ కేయూ1: ఎన్ ఎల్ 63 ఆల్ఫా వైరస్  కాగా, హెచ్ కేయూ1 బీటా వైరస్ . తొలిసారిగా 2004లో నెదర్లాండ్స్ లో కనిపెట్టారు. 2005లో హాంకాంగ్ లోనూ దాని ప్రభావం కనిపించింది.

సార్స్ కొవ్ : 2003లో చైనాలో గుర్తించారు.

మెర్స్ : 2012లో సౌదీ అరేబియాలో బయటపడింది. ఒంటెల నుంచి పాకిందీ వైరస్ .

సార్స్ కొవ్ 2: 2019లో వుహాన్ లో పుట్టిందీ వైరస్ . ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్  ఇదే.