అమెరికాపై గూఢచర్యానికి పాల్పడిన చైనా

అమెరికాపై గూఢచర్యానికి పాల్పడిన చైనా

మరోసారి అమెరికాపై చైనా ఫోకస్ చేసింది. ఏకంగా గూఢచర్యానికి సాహసించింది. అమెరికాలో ఆకాశంలో చైనీస్ స్పై బెలూన్ ను పెంటగాన్ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత వెంటనే అప్రమత్తమైన అమెరికా అధికారులు చైనా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. అనుమానిత చైనీస్ గూఢచారి బెలూన్ గత రెండు రోజులుగా యునైటెడ్ స్టేట్స్ మీదుగా ఎగురుతుండటాన్ని గుర్తించినట్లుగా పెంటగాన్ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను సేకరించినట్లుగా వెల్లడించింది. ఈ బెలూన్ సైజు మూడు బస్సులతో సమానమని తెలుస్తోంది. బెలూన్‌ను కాల్చివేయాలని సైనికాధికారులు భావించారని సీనియర్ US రక్షణ అధికారి తెలిపారు. 

కానీ అది భూమిపై ఉన్న చాలా మందిని ప్రమాదంలో పడేస్తుందనే భయంతో అలా చేయలేదని తెలిపారు. చైనీస్ గూఢచారి బెలూన్ నిఘా కోసం ఉద్దేశించబడిందని.. అనేక సున్నితమైన ప్రదేశాలపై ఎగురుతున్నదని అమెరికా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ బెలూన్ ఉత్తర మోంటానా ఆకాశంలో ఎగురుతోంది. ఇదిలావుండగా చైనా బెలూన్ ప్రస్తుతం వాణిజ్య వాయు ట్రాఫిక్ కంటే చాలా ఎత్తులో ప్రయాణిస్తోందని, దీంతో ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని పెంటగాన్ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాలో గూఢచర్యం చేస్తున్నట్టు చైనాపై ఆరోపణలు రావడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా చైనా అమెరికాలో గూఢచర్యం చేసేందుకు ప్రయత్నించింది.