50 ఎలుకలు తిని.. 14 కేజీల బరువు తగ్గిన చైనా యువతి.. దట్టమైన అడవిలో ఏం జరిగింది..?

50 ఎలుకలు తిని.. 14 కేజీల బరువు తగ్గిన చైనా యువతి.. దట్టమైన అడవిలో ఏం జరిగింది..?

సాధారణంగా అడవిలో జీవించడం అంటే ధైర్యం, ఓర్పు అనుకుంటాం. కానీ చైనాకు చెందిన 25 ఏళ్ల యువతి జావో టిజు (Zhao Tiezhu)కు ఇది అనుకోకుండా బరువు తగ్గడానికి మార్గంగా మారింది. అడవిలో మనుగడ (Wilderness Survival) అనే పోటీలో కాంస్య పతకం గెలవడమే కాకుండా, ఈ ఛాలెంజ్‌లో ఆమె  14 కిలోల బరువు తగ్గినట్లు  తెలిపింది.

ఈస్టర్న్ చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని ఒక ద్వీపంలో అక్టోబర్ 1న ఈ వైల్డర్‌నెస్ సర్వైవల్ పోటీ ప్రారంభమైంది. నవంబర్ 5 వరకు జావో టిజు మొత్తం 35 రోజులు అరణ్యంలో జీవించింది. ఇన్ని రోజులు  జీవించినందుకు, ఆమె మూడవ స్థానంలో నిలిచి 7,500 యువాన్లు (రూ. 88,608) బహుమతి అందుకుంది. అందులో 30 రోజులు పూర్తి చేసినందుకు 6,000 యువాన్లు (రూ. 74,430), ప్రతి అదనపు రోజుకు 300 యువాన్లు (రూ. 3,544) ఉన్నాయి.
 
పోటీ సమయంలో ఎదురైన కష్టాలు, వాతావరణం, ఎండ వల్ల ఆమె శరీరంపై దెబ్బలు తగిలినా, బరువు తగ్గడం మాత్రం పెద్ద విజయమని జావో టిజు చెబుతుంది. ఆమె బరువు మొదట్లో 85 కిలోల నుంచి ప్రస్తుతం 71 కిలోలకు తగ్గింది. బరువు తగ్గడానికి ముఖ్య కారణం అడవిలో సేకరించిన ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారమే అని చెప్పింది. ఆమె ఆహారంలో పీతలు, సముద్రపు అర్చిన్లు, అబలోన్ (సముద్రపు నత్తలు) కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ 35 రోజుల్లో ఆమె 50 ఎలుకలను వేటాడి, శుభ్రం చేసి కాల్చి తిన్నది కూడా. ఆమె అభిప్రాయం ప్రకారం, ఎలుకలు చాలా రుచిగా ఉన్నాయట.. పోటీ తర్వాత తినడానికి ఆమె ఎలుకల మాంసాన్ని ఎండబెట్టుకొని (ఎలుక జెర్కీ) కూడా తెచ్చుకుంది.

నవంబర్ 4న ద్వీపాన్ని ఓ పెద్ద తుఫాను తాకడంతో జావో ఛాలెంజ్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నానని, ఇప్పుడు ఇంట్లో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. నిర్వాహకుల ప్రకారం, ఇంకా ఇద్దరు పురుషులు అదే ద్వీపంలో ఉన్నారు. వీళ్ళు  మొదటి బహుమతి 50,000 యువాన్ల అంటే సుమారు రూ. 6,20,168 కోసం పోటీ పడుతున్నారు.

హునాన్ ప్రావిన్స్‌ జాంగ్జియాజీలోని సెవెన్ స్టార్ మౌంటైన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ పోటీలు జరుగుతున్నాయి. ఎక్కువ రోజులు ఈ పోటీలో ఉన్న పోటీదారుడు సుమారు 25 లక్షల గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకుంటాడు. ఈ పోటీని ఆన్‌లైన్‌లో లైవ్ టెలికాస్ట్ చూడొచ్చు. ఈ కార్యక్రమాన్ని మౌంటైన్‌ రిసార్ట్ అధికారిక కార్యాలయం పర్యవేక్షిస్తుంది. సరైన వైద్య, లాజిస్టికల్ సపోర్ట్  లేకుండా ఇటువంటి విన్యాసాలను ప్రయత్నించవద్దని నిర్వాహకుడు ప్రజలను హెచ్చరించారు.