మాకు ఎవరితో గ్యాప్ లేదు..పెట్టుకుంటే ఏం చేయలేం

మాకు ఎవరితో గ్యాప్ లేదు..పెట్టుకుంటే ఏం చేయలేం

మహిళలను కించపరిచే విధంగా మాట్లాడం తమ పద్ధతి కాదన్నారు ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి. గ్రామదేవతలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఆయన వివరణ ఇచ్చారు.  విజయవాడలో  ఇంద్రకీలాద్రిలో వార్షిక వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన  చినజీయర్  స్వామి .. ఇవాళ అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవమన్నారు. జ్ఙానులైన ఆదివాసీలను గౌరవించాలన్నారు. ఆదివాసి, గిరిజనులను మనం గౌరవించాలన్నారు.  మనిషి  బ్రాహ్మణుడా? గిరిజనుడా కాదు..జ్ఞానం ముఖ్యమన్నారు.  తిరుమళసై కూడా  జన్మ దృష్ట్యా ఒక దళితుడన్నారు. అవకాశం లేకే ఆదివాసీ గిరిజనుల వెనుకబడ్డారన్నారు. గిరిజనులు మంత్రాలను అద్భుతంగా చదువుతారన్నారు. ఆదివాసీలు, హరిజనులు అనే తేడా లేకుండా  ప్రగతి పథంలో నడిపించాలని తమ గురువులు చెప్పారన్నారు. రామానుజ పరంపరలో  గిరిజనులు, ఆదివాసీలకు సమాన గుర్తింపు ఉంటుందన్నారు.

ఈ మధ్య తనపై వచ్చిన ఆరోపణలను ఎలా వచ్చాయో వారి వివేకానికే వదిలేస్తున్నానన్నారు చినజీయర్ స్వామి. తాను గ్రామదేవతల్ని అవమానించారని ఆరోపించడం సరికాదన్నారు. పూర్వపరాలు చూడకుండా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఏదైనా అంటే వెనకా ముందు చూడాలన్నారు.  మహిళలను కించపరిచే పద్దతి తమది కాదన్నారు. ఒకళ్లను లేదా  కొంత మంది దేవతలను చిన్న చూపు చూడటం అనేది పొరపాటన్నారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం  అన్నదానిని ఇపుడు  వివాదం చేస్తున్నారన్నారు. తన వ్యాఖ్యలను ఎడిటింగ్ చేసి తప్పుబట్టడం హస్యాస్పదమన్నారు. ఎవరిపద్ధతిలో వాళ్లుండాలన్నారు. తాత్పర్యం తెలుసుకోకుండా  ఆరోపణలు చేస్తే.. వారిపై జాలిపడాల్సి వస్తుందన్నారు. గ్రామదేవతలు మనుషుల్లోంచే వచ్చారన్నారు. ఆదివాసీల కోసం ఏ సంస్థ చేయని సేవా కార్యక్రమాలను చేశామన్నారు. మధ్యలో ఒకదాని తీసుకుని వివాదం చేయడం కరెక్ట్ కాదన్నారు. మహిళలను చిన్న చూపు చూసేపద్ధతిని ప్రోత్సహించబోమన్నారు. తామెప్పుడూ అలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయలేదన్నారు. సొంత లాభాన్ని  వాడుకునే వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన బాధ్యత ఉందన్నారు. పనిగట్టుకుని కొంత మంది ఇష్యూ చేస్తున్నారన్నారు. ఇది పబ్లిసిటీ కోరుకునే వాళ్లు చేసే అల్ప ప్రచారమన్నారు. తమకు కులం,మతం అనే తేడా లేదన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు  క్రిస్టియన్లు, ముస్లీంలు అందరూ వస్తారన్నారు. అందర్ని గౌరవించాలనేదే తమ విధానమన్నారు.

అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టడం సరికాదన్నారు. కెమెరాలున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దన్నారు చినజీయర్. కోడి గుడ్డు మీద ఈకలు పీకవద్దన్నారు.దీక్ష తీసుకున్న వాళ్ల కోసం మాత్రం మాంసాహారం వద్దని చెప్పామన్నారు.  తమకు ఎవరితో గ్యాప్ లేదని..పెట్టుకుంటే ఏం చేయలేమన్నారు. యాదాద్రికి పిలిస్తే వెళ్తాం..లేదంటే చూసి ఆనందిస్తామన్నారు. తమకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు రాదన్నారు. ఏవరైనా సలహా అడిగితే చేసి పెట్టడం తమ బాధ్యతన్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండాలనే సమతామూర్తి వద్ద రూ.150 టికెట్ పెట్టామన్నారు.నిర్వహణ ఖర్చుకోసం ఎంట్రీ  ఫీజు పెట్టామన్నారు.