సమ్మక్క, సారలమ్మలపై చిన జీయర్ వివాదాస్పద వ్యాఖ్యలు

సమ్మక్క, సారలమ్మలపై చిన జీయర్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • గతంలోని వీడియోపై తీవ్ర దుమారం.. భగ్గుమన్న ఆదివాసీ, ప్రజా సంఘాల నాయకులు 
  • జీయర్​ దిష్టిబొమ్మ దహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్​
  • అట్రాసిటీ కేసు పెట్టాలన్న తెలంగాణ గిరిజన సంఘం
  • భక్తులతో వ్యాపారం చేసేదే జీయర్..  
  • ఆయన వ్యాఖ్యలు అహంకారపూరితం: ఎమ్మెల్యే సీతక్క
  • చినజీయర్ చుట్టూ రియల్ వ్యాపారులే: సీపీఐ నేత నారాయణ
  • తెలంగాణ ఏర్పాటుకు ముందు జరిగిన దాన్ని ఇప్పుడు జరిగినట్లు చిత్రీకరించొద్దు: కొణతం దిలీప్​

హైదరాబాద్​/ములుగు, వెలుగు: మేడారం వన దేవతలు సమ్మక్క, సారలమ్మపై చిన జీయర్​ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. క్షమాపణ చెప్పాలంటూ ఎమ్మెల్యే సీతక్క, సీపీఐ జాతీయకార్యదర్శి నారాయణతోపాటు ఆదివాసీ సంఘాల, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. ‘‘అసలు సారక్క, సమ్మక్క ఎవరు? పోనీ దేవతలా! బ్రహ్మలోకం నుంచి దిగొచ్చినోళ్లా?’’ అంటూ చిన జీయర్​ గతంలో  మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్​ అవుతున్నది. మంగళవారం సాయంత్రం నుంచి జీయర్​వ్యాఖ్యలను ఖండిస్తూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. కులాల ఆచార వ్యవహారాలను జీయర్​ తక్కువ చేసి మాట్లాడడం కొత్తేం కాదని, మాంసాహారం తినేవాళ్ల విషయంలోనూ, కులాల విషయంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.  ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరున్న ఆదివాసీల ఇలవేల్పులు సమ్మక్క, సారలమ్మపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆదివాసీ సంఘాల, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిన జీయర్  కామెంట్లు ఇవే..

‘‘అసలు సారక్క, సమ్మక్క ఎవరు? పోనీ వారేమైనా దేవతలా! బ్రహ్మలోకం నుంచి దిగివచ్చినవారా.. ఏమిటి చరిత్ర.. ? అదేదో అది ఒక అడవి దేవత.. గ్రామదేవత. సరే చేసుకోని అక్కడున్నవాళ్లు. చదువుకున్న వాళ్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు.. ఆ పేరిట బ్యాంకులే పెట్టేశారండి తర్వాత. అది వ్యాపారమైపోయింది ఇప్పుడు. ఎంత అన్యాయం చూశారా అండీ? అది ఒక చెడు. కావాలనే సమాజంలో వ్యాపింపజేస్తున్నారు..’’ అంటూ చిన జీయర్​  కామెంట్లు చేశారు. 

జీయర్​ దిష్టిబొమ్మ దహనం

జీయర్​ వ్యాఖ్యలను నిరసిస్తూ ములుగు జిల్లా ఏటూరునాగారం కేంద్రంలో తుడుందెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీయర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మేడారంలో ఆదివాసీ సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ములుగులో ఆదివాసీ నాయకపోడ్​ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త రాజ్​ కుమార్​ ఆధ్వర్యంలో పూజారులు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. చిన జీయర్​పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మ నాయక్, ఆర్.శ్రీరామ్ నాయక్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చిన జీయర్  మరో డేరా బాబాగా మారిండని, భక్తి ముసుగులో రామానుజుల విగ్రహం పెట్టి వేల కోట్ల దోపిడీకి పాల్పడుతున్నడని ఆరోపించారు.

ఆ వ్యాఖ్యలు అహంకారపూరితం:ఎమ్మెల్యే సీతక్క

తెలంగాణ పోరాటానికి ప్రతీకలైన సమ్మక్క, సారలమ్మపై చిన జీయర్​ స్వామి వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయని ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. ఆంధ్రాకు చెందిన చిన జీయర్..​ ఆదివాసీల ఇలవేల్పులపై నమ్మకాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదని ఫైర్ అయ్యారు. ప్రపంచ నలుమూలల్లో సమ్మక్క, సారలమ్మపై ఉన్న నమ్మకాన్ని తగ్గించేలా జీయర్​ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఆదివాసీ తల్లులపై జీయర్ చేసిన వ్యాఖ్యలను వాపస్ తీస్కోవాలని డిమాండ్​ చేశారు. తమ దేవతలు ప్రకృతి దేవతలని,  ప్రజల గుండెల్లో ఉన్నారని, రియల్​ వ్యాపారం కానీ, టిక్కెట్లు పెట్టి దర్శించుకునే దౌర్భాగ్యం కానీ ఇక్కడ లేదని అన్నారు. ‘‘120 కిలోల బంగారంతో చేసిన సమతామూర్తి విగ్రహం వద్ద దర్శనానికి రూ. 150 ధర పెట్టి భక్తులతో వ్యాపారం చేసేది మీరు” అని చిన జీయర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. జీయర్​ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్​ వైఖరిని తెలపాలన్నారు. ‘‘పేదల కోసం ఇండ్లకు 100 గజాల జాగ దొరకడంలేదు కానీ, మీకు వందల ఎకరాల స్థలమెట్ల వస్తుంది? ఎప్పుడైనా రూ.లక్ష తీస్కోకుండా పేదల ఇండ్లకు పోయిన్రా?” అని సీతక్క ప్రశ్నించారు.

 

వెంటనే క్షమాపణలు చెప్పాలి: నారాయణ

ఆనాడు చక్రవర్తుల పన్నువిధానాలకు వ్యతిరేకంగా పోరాడి, ఆ క్రమంలోనే సమ్మక్క, సారలమ్మ అసువులు బాశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గుర్తు చేశారు. అలాంటి పోరాట కేంద్రం గురించి చిన జీయర్ లాంటి వాళ్లు తేలిగ్గా మాట్లాడడం, అవమానించేలా మాట్లాడడం సరికాదన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

గందరగోళం సృష్టించొద్దు: కొణతం దిలీప్

జీయర్ వ్యాఖ్యలను ఖండించండి కానీ, రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2012లో జరిగిన దాన్ని ఇప్పుడు జరిగినట్లు చిత్రీకరించి జనాలను గందరగోళపరచొద్దని తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ అన్నారు. ఫేస్​బుక్​లో చేసిన ఆ కామెంట్లను కొద్దిసేపటికే డిలీట్​ చేశారు.