
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా మాజీ మంత్రి చిన్నారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అపారమైన రాజకీయ అనుభవం ఉన్న చిన్నారెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా పనిచేశారు. పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం చైర్మన్ గా తన వాణి వినిపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వనపర్తి టికెట్ ను మొదట చిన్నారెడ్డికే పీసీసీ కేటాయించింది. తర్వాత ఆ టికెట్ ను తూడి మేఘారెడ్డికి మార్చేసింది.
ఈ సందర్భంగా చిన్నారెడ్డి నొచ్చుకోగా ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ అధినాయకత్వం భరోసా ఇచ్చింది. ఆ తర్వాత ఆయన రాజ్యసభ టికెట్ ఆశించారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్న రెండు టికెట్లలో ఒకటి రేణుకా చౌదరికి, మరోటి అనిల్ కుమార్ యాదవ్ కు కేటాయించడంతో అక్కడా నిరాశే ఎదురైంది.
ఈ నేపథ్యంలో ఆయనను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించింది. ఇప్పుడు కూడా వనపర్తికి చెందిన జీ చిన్నారెడ్డికి ఇదే పోస్టు కేటాయించడం విశేషం.