రాజ్ తరుణ్, కుషిత కల్లపు జంటగా అభినయ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘చిరంజీవ’. రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించారు. శుక్రవారం నుంచి ‘ఆహా’ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్‌కు వస్తోంది. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘‘గౌతమ్ ఎస్‌ఎస్‌సి’ టైమ్ నుంచి నాకు అభి తెలుసు. ఆ తర్వాత ‘కందిరీగ చిత్రానికి తెలంగాణ యాసలో డైలాగ్స్ రాసేందుకు అభి హెల్ప్ తీసుకున్నా.
జబర్దస్త్ షోతో అదిరే అభిగా పాపులర్ అయిన తను, దర్శకుడిగా హిట్ అందుకోవాలని కోరుకుంటున్నా. అలాగే రాజ్ తరుణ్‌కు కమ్ బ్యాక్ సినిమా కావాలని కోరుకుంటున్నా’ అని విష్ చేశాడు. అభినయ కృష్ణ మాట్లాడుతూ ‘జబర్దస్త్ స్కిట్స్‌లో కొత్తదనం కోసం ప్రయత్నించినట్టుగానే ఈ సినిమాలో హీరోకు ఏజ్ మీటర్ అనే కాన్సెప్ట్ పెట్టి కొత్త ప్రయత్నం చేశాను.
ఇది అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా’ అని చెప్పాడు. హీరో రాజ్ తరుణ్, నటులు సంజయ్ కృష్ణ, కిరీటి, హైపర్ ఆది, రాకెట్ రాఘవ, ఆటో రాంప్రసాద్, ప్రొడ్యూసర్ రాహుల్ అవుదొడ్డి, ఆహా ప్రతినిధులు రవికాంత్, శ్రావణి పాల్గొన్నారు.
