Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. చిరు, అల్లు అర్జున్ స్పెషల్ విషెస్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. చిరు, అల్లు అర్జున్ స్పెషల్ విషెస్

‘‘టాలీవుడ్ పవర్ స్టార్, జనసేనాని, డిప్యూటీ సీఎం’’.. ఇవి పవన్ కల్యాణ్ సాధించిన విజయాలు. ఈ ప్రయాణం వెనుక అకుంఠిత దీక్ష, వీరోచిత పోరాటం, ఆత్మవిశ్వాసం అనే ఆయుధాలు ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ను గుండెల్లో పెట్టుకునే కోట్ల మంది అభిమానులు ఉన్నారు.

ఈ క్రమంలోనే అన్న చిరంజీవి చూపిన బాటలోనే (సినిమా) పవన్ ఎదుగుతూ.. రాజీకీయాల్లోను తనదైన విలక్షణతను చాటుకున్నారు. ఇవాళ (సెప్టెంబర్ 2న) తన 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, జనసైనికులు, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన శైలిలో విషెష్ తెలిపారు. ‘‘మన పవర్‌ స్టార్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని పవన్ తో కలిసున్నా ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో వీరిమధ్య ఉన్న బంధాన్ని ఎవ్వరూ వీడదీయలేరని ఇరువురి ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.   

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ‘‘చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను.. దీర్ఘాయుష్మాన్ భవ! ’’ అని చిరంజీవి తన ఆశీస్సులు అందించారు.

రాష్ట్రాభివృద్దిలో మీ సహకారం మరువలేనిది అని పవన్కు విషెష్ తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు.  ‘‘మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం... అణువణువునా సామాజిక స్పృహ... మాటల్లో పదును... చేతల్లో చేవ... జన సైన్యానికి ధైర్యం... మాటకి కట్టుబడే తత్వం... రాజకీయాల్లో విలువలకు పట్టం....స్పందించే హృదయం...అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి...మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్దిలో మీ సహకారం మరువలేనిది అని తెలియజేస్తూ.....మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’’  అని ఫోటో షేర్ చేశారు. 

పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ విషెష్ చెబుతూ.. ‘‘నాకు పట్టుదల నేర్పించి.. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన నా గురువుకు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే కల్యాణ్‌ మామ’’ అని శుభాకాంక్షలు తెలిపారు.