
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' 'విశ్వంభర' చిత్రాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాల సందడి ఒకవైపు ఉండగానే , దర్శకుడు బాబీ కొల్లి తో చిరంజీవి చేయబోయే తదుపరి మూవీపై సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చ నడుస్తోంది. అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది..
చిరు-బాబీ కాంబోలో...
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టులో ఈ 'చిరుబాబీ2' (వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఒక కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' (2023) ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ యాక్షన్-థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సారి కూడా అదే స్థాయి సక్సెస్ ను సొంతం చేసుకునేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. బాబి దర్శకత్వంలో ఈ ఏడాది జనవరిలో విడుదలైన నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం 'దాకు మహారాజ్' కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో, చిరు-బాబీ ద్వయం నుంచి వస్తున్న ఈ కొత్త సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
Also Read : మహాభారత్ కర్ణుడు..నటుడు పంకజ్ ధీర్ మృతి
హీరోయిన్ గా మాలవికా మోహనన్?
ఈ 'మెగా158' చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారనే విషయంపై ఆసక్తికరమైన చర్చ సినీ వర్గాల్లో నడుస్తోంది. చిరు సరసన హీరోయిన్ గా నటించేందుకు మాలవికా మోహనన్ తో మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మాలవికా మోహనన్, తెలుగులో తొలిసారిగా ప్రభాస్ హీరోగా నటించిన 'ది రాజా సాబ్' చిత్రంతో పరిచయమైంది.. ఈ సినిమా సంక్రాంతి 2026కి విడుదల కానుంది. ఒకవేళ చిరంజీవితో ఈ సినిమా కనుక ఖరారైతే, 'చిరుబాబీ2' ఆమెకు రెండో తెలుగు చిత్రమవుతుంది. ఇటీవల మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి నటించిన 'హృదయపూర్వం' చిత్రం సక్సెస్ ను సొంతం చేసుకుంది.
చిరు-బాబీ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ ఎన్‌కే నిర్మిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. 'మిరాయి' చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కార్తీక్ ఘట్టమనేని, దర్శకుడిగా, ఎడిటర్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా తన ప్రతిభను ఇప్పటికే నిరూపించుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ సినిమాకు ఆయన కెమెరామెన్‌గా వ్యవహరించడం విశేషం. చిరంజీవి అభిమానులు ఈ సినిమా త్వరగా సెట్స్ పైకి వెళ్లాలని, మూవీ మేకర్స్ నుంచి మరింత అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.