సినీ కార్మికులు నన్ను కలవలేదు.. నా చేతుల్లో ఏం లేదు: చిరంజీవి

సినీ కార్మికులు నన్ను కలవలేదు.. నా చేతుల్లో ఏం లేదు: చిరంజీవి

వేతనాల పెంపు అంశంపై ఫెడరేషన్ సభ్యులు తనను కలిసినట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు చిరంజీవి. తనను ఎవరూ కలవలేదని, వేతనాల పెంపు అంశం తన చేతుల్లో ఏం లేదని స్పంష్టం చేశారు. ఈ దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని శనివారం (ఆగస్టు 09) ఎక్స్ లో పేర్కొన్నారు. 

ఫిలిం ఫెడరేషన్ సభ్యులు తనను కలిసినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు చిరంజీవి. కార్మికులు తనను కలిశారని.. 30 శాతం వేతనాల పెంపునకు అంగీకరించానని.. షూటింగ్ కూడా ప్రారంభిస్తానని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇది ఇండస్ట్రీ మొత్తం తీసుకోవాల్సిన నిర్ణయం అని.. తన చేతుల్లో ఏమీ లేదని చెప్పారు. 

కార్మికుల వేతనాల పెంపు అనేది ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య అని అన్నారు చిరంజీవి. తెలుగు సినీ పరిశ్రమలో ఫిలిం ఛాంబర్ అతున్యత సంస్థ అని చెప్పిన ఆయన.. ఎలాంటి నిర్ణయాలైనా, చర్చలైనా, పరిష్కారమైనా ఫిలిం ఛాంబరే తీసుకుంటుందని తెలిపారు.  ఏకపక్షంగా ఎవరూ నిర్ణయం తీసుకోలేరు చిరంజీవి.. ఇలాంటి తప్పుడు ప్రచారంతో ఇండస్ట్రీలో కన్ఫూజన్ క్రియేట్ చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు చిరంజీవి. 

వేతనాలు పెంచాలని గత కొంత కాలంగా కార్మికులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. వేతనాల పెంపుపై ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాకు దిగారు. షూటింగ్ లను నిలిపివేసి ఆందోళన చేపట్టారు. జీతాలు పెంచే వరకు విధులకు హాజరయ్యేది లేదని తేల్చిచెప్పారు. 

కార్మికుల డిమాండ్లపై ఫిలిం ఛాంబర్ సభ్యులు భేటీ అయ్యారు. కార్మిక సంఘాలు కోరుతున్నట్లు 30 శాతం జీతాల పెంపు సాధ్యం కాదని TFCC ప్రకటన  విడుదల చేసింది. తెలుగు సినీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని.. ఈ పరిస్థితుల్లో జీతాలు పెంచాలనడం సరికాదని ప్రకటనలో పేర్కొంది. సామరస్య పూర్వకంగా చర్చలు జరుపుతున్న సమయంలో ఆందోళనలు నిర్వహించడం సమంజసం కాదని తెలిపింది. 

ఒకవైపు వేతనాలు పెంచాలని కార్మికులు.. మరోవైపు కుదరదని.. కొత్తవాళ్లను తీసుకుంటామని ఫిలిం ఛాంబర్ చెప్పడంతో వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. లేటెస్ట్ గా కార్మికులు దిగొచ్చేవరకు షూటింగ్ లు బంద్ పెడుతున్నట్లు ఛాంబర్ ప్రకటించింది. అలాగే, అది ఎంత పెద్ద సినిమా ఐనా.. తమ అనుమతి లేకుండా షూటింగ్లు జరపకూడదని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఔట్ డోర్, స్టూడియో వంటి అన్నీరకాలైన షూటింగ్స్ తక్షణమే నిలిపివేయాలని ఫిల్మ్ చాంబర్ కీలక ఆదేశాలు జారీ చేసింది.