చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో లేరు: ఉమెన్ చాందీ

చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో లేరు: ఉమెన్ చాందీ

విజయవాడ: ప్రముఖ హీరో చిరంజీవి కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. సినిమా కార్యక్రమాలు తప్ప రాజకీయ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించని ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం లేదని ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందీ స్పష్టం చేశారు. తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని  కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత చిరంజీవి కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న విషయం తెలిసిందే. స్వతంత్ర హోదాలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి పెద్దగా కనపడటం లేదు. చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు ప్రకటించిన సందర్భంగా చిరంజీవి గురించి ఆయన స్పష్టత ఇచ్చారు.  పెట్రోల్‌ ధరలపై నిరసనలు చేపట్టాలని ఏఐసీసీ స్థాయిలో నిర్ణయించారని, జూలై 7 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో చిరంజీవి పాల్గొంటారా అంటూ పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించి ఆయన పార్టీలో కొనసాగడం లేదన్నారు. తమ కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతున్నాయని.. ధరల భారంపై త్వరలో అన్ని జిల్లాల్లో సైకిల్ యాత్రలు చేస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఈ విషయంలో బీజేపీ మోసం చేసిందని  ఆరోపించారు. ప్రత్యేక  హోదా విషయంలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఉమెన్‌ చాందీ విమర్శించారు.