సినీ కార్మికుల వేతనాల పెంపుపై వీడని చిక్కుముడి.. చిరంజీవి మధ్యవర్తిత్వం.. కీలక భేటీ.!

సినీ కార్మికుల వేతనాల పెంపుపై వీడని చిక్కుముడి.. చిరంజీవి మధ్యవర్తిత్వం.. కీలక భేటీ.!

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న కార్మికుల సమ్మె రోజురోజుకు తీవ్రమవుతోంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ అసోసియేషన్ (TFIEMAF), తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలు విఫలం కావడంతో, సమస్య మరింత జఠిలమవుతోంది. దీనివల్ల పలు పెద్ద, చిన్న చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయి, సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం వహిస్తుండటంతో, అందరి దృష్టి ఆయన వైపే ఉంది.

నిర్మాతల మండలి వాదన
సమ్మె చేస్తున్న కార్మికుల ప్రధాన డిమాండ్ తమ వేతనాల్లో 30 శాతం పెంపు.  ప్రస్తుతం జీవన వ్యయం పెరిగినా వేతనాల్లో ఎలాంటి మార్పు లేదని, తమ శ్రమకు తగ్గ వేతనం కావాలని కార్మికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు వేతనాలు పెంచాల్సి ఉందన్నారు. అయితే, నిర్మాతల మండలి మాత్రం వారి డిమాండ్స్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సినిమాల బడ్జెట్లు ఇప్పటికే భారీగా పెరిగిపోయాయని, ఈ పరిస్థితుల్లో 30 శాతం పెంపు సాధ్యం కాదని నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలు ఇతర సినీ పరిశ్రమల కంటే ఎక్కువగా ఉన్నాయని, చిన్న నిర్మాతలు ఈ భారాన్ని భరించలేరని వారు వాదిస్తున్నారు. 

చిరంజీవితో  నిర్మాతల సమావేశం
సమ్మె కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో పలువురు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని ఆశ్రయించారు. కార్మికులకు, నిర్మాతల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని ఆయనను కోరారు. దీంతో చిరంజీవి ఇంట్లో ఒక కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అల్లు అరవింద్, సుప్రియ యార్లగడ్డ, మైత్రీ రవి, కేఎల్ నారాయణ, సురేష్ బాబు, సి.కళ్యాణ్ వంటి ప్రముఖ నిర్మాతలు హాజరయ్యారు. సడెన్‌గా షూటింగ్‌లు ఆపడం భావ్యం కాదని చిరంజీవి అభిప్రాయపడినట్లు నిర్మాతలు తెలిపారు. నిర్మాతల పరిస్థితి విన్న చిరరంజీవి కార్మికుల వెర్షన్ కూడా తెలుసుకుంటానని చెప్పినట్లు నిర్మాత సి. కళ్యాణ్ తెలిపారు.

ఈ వివాదంపై రేపు సమావేశమై చర్చించుకుని తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.  ఈ కార్మికుల సమస్యలపై  రెండు మూడు రోజులు వేచి చూస్తాను, అప్పటికి పరిష్కారం కాకపోతే నేను ఒక నిర్ణయం చెబుతాను" అని చిరంజీవి అన్నారని నిర్మాత సి. కళ్యాణ్ మీడియాకు వెల్లడించారు. చిరంజీవి మధ్యవర్తిత్వంపై నిర్మాతలు సానుకూలంగా స్పందించారు.

మరోవైపు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్‌తో సమావేశమై తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. పనికి తగ్గ వేతనాలు కావాలని అడుగుతున్నామని అని యూనియన్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. తాము డిమాండ్ చేస్తున్న 30 శాతం పెంపుకు నిర్మాతలు అంగీకరించకుంటే సమ్మె కొనసాగుతుందని కార్మికులు హెచ్చరిస్తున్నారు. 

ప్రస్తుతం పరిశ్రమలో 10కి పైగా సినిమాల షూటింగ్‌లు కొనసాగుతున్నప్పటికీ, మిగతా ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయి. 30 శాతం పెంపు ఇస్తేనే షూటింగ్‌లలో పాల్గొంటాం, లేకపోతే సమ్మె కొనసాగుతుంది అని కార్మికులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు 30 శాతం పెంచే సమస్యే లేదు, వారి బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గం అని నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఫిల్మ్ ఛాంబర్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. యూనియన్ సభ్యత్వం లేని నైపుణ్యం కలిగిన కార్మికులను కూడా నియమించుకోవచ్చని ప్రకటించింది. ఇది యూనియన్‌కు గట్టి హెచ్చరిక పంపినట్లు అయింది. ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి మధ్యవర్తిత్వంతో ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.