
- వాటిని తినడంతో దెబ్బతింటున్న నాడీ వ్యవస్థ.. సడెన్ బ్రెయిన్ స్ట్రోక్స్
- ప్రతి 4 నిమిషాలకు ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం
- ఇటీవలి కాలంలో రాష్ట్రంలోనూ పెరుగుతున్న కేసులు
- ఇందుకు ప్రధాన కారణం కడుపులో
- క్లోర్ పైరిఫాస్ అవశేషాలు చేరడమే
- 40 దేశాల్లో ఇప్పటికే ఈ పురుగు మందుపై నిషేధం
- మనదేశంలోనూ నిషేధించాలంటూపెరుగుతున్న డిమాండ్లు
హైదరాబాద్, వెలుగు: కూరగాయలు, పండ్ల తోటల్లో పురుగుమందుగా పిచికారీ చేస్తున్న క్లోర్ పైరిఫాస్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. 40కి పైగా దేశాల్లో నిషేధం ఉన్న ఈ పురుగు మందును మన దేశంలో, మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో విచ్చలవిడిగా వాడుతున్నారు. మనం పండ్లు, కూరగాయలు తినేటప్పుడు వాటితోపాటు ఈ రసాయన అవశేషాలు కూడా మన కడుపులోకి వెళ్లడంతో నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతున్నది. మతిమరుపు, పక్షవాతం, సడెన్ బ్రెయిన్ స్ర్టోక్స్కు కారణమవుతున్నది.
దేశవ్యాప్తంగా ప్రతి 40 సెకన్లకు ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుండగా.. ప్రతి 4 నిమిషాలకు ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం నమోదవుతున్నదని ఇండియన్ కౌన్సిల్ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీస్(జీబీడీ) స్టడీస్ వెల్లడించాయి. వీటికి ఎక్కువ కారణం క్లోర్ పైరిఫాస్ వాడకమేనని నిపుణులు చెప్తున్నారు. తెలంగాణలోనూ అంతకంతకూ పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో 2024లో 1,200కు పైగా బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 30% మంది 45 ఏండ్లలోపు వారే ఉన్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌లకు, నాడీ సంబంధ రోగాలకు క్లోర్ పైరిఫాస్ అనే పురుగు మందు అవశేషాలు కారణమవుతుండటంతో దాన్ని భారత్‌లోనూ నిషేధించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
కడిగి తిన్నా.. ముప్పు తప్పుతలే
రాష్ట్రంలో ఏటా 2 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ఇందులో కోటికి పైగా ఎకరాల్లో వరి పండిస్తున్నారు. ఉద్యానపంటల వాటా పదిశాతం వర కు ఉంటున్నది. గత వానాకాలం సీజన్లో 12.96 లక్ష ల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగయ్యాయి. ఇందులో 4 నుంచి 5 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు ఉండగా, సుమారు 2 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతున్నది. ఉద్యానపంటలపై క్రిమికీటకాల నివారణకు రైతులు ఎక్కువగా క్లోర్‌పైరిఫాస్ ను వాడుతున్నారు.
ఈ రసాయనం పంటలపై చీడపీడలను నివారిస్తున్నప్పటికీ.. దాని అవశేషాలు కూరగాయలు, పండ్ల ద్వారా మానవ శరీరంలోకి చేరుతున్నాయి. బియ్యం, కూరగాయలు, పండ్ల లోపలికి ఈ అవశేషాలు వెళ్లడం వల్ల.. కడిగి తిన్నా, ఉడికించి తిన్నా నష్టం జరుగుతున్నది. కొన్ని కూరగాయలపై క్లోర్ పైరిఫాస్ అవశేషాలు ఎంత కడిగినా, ఉడికించినా పోవని, అలాంటి కూరగాయలను తింటే మరింత ప్రమాదమని నిపుణులు చెప్తున్నారు.
పిచికారీ చేసే రైతులపై మరింత ఎఫెక్ట్
క్లోర్‌పైరిఫాస్ పిచికారీ చేసే రైతులు జాగ్రత్తలు తీసుకోకపోతే వారిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో 2020లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. ప్రతి లక్ష మందిలో 257 బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. కూరగాయలు, పండ్ల తోటలు ఎక్కువగా సాగుచేసే చాలా మండలాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. క్లోర్‌పైరిఫాస్ ప్రధానంగా నాడీవ్యవస్థపై ఎఫెక్ట్చూపిస్తుందని, ఈ కెమికల్శరీరంలో ప్రవేశించగానే రక్తనాళాల్లో అడ్డంకులను సృష్టించి.. స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యరంగ నిపుణులు చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్న రైతులతో పాటు క్లోర్ పైరిఫాస్ అవశేషాలు ఉన్న కూరగాయలను ఎక్కువగా తినే వారిలో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు అనేక రెట్లు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
నిషేధించాలనే డిమాండ్లు
దేశంలో, రాష్ట్రంలో ఎక్కువగా వాడుతున్న పురుగుమందుల్లో క్లోర్ పైరిఫాస్ ఆర్గానోపాస్ఫేట్ అనే రసాయనం ఒకటి. దేశంలో వినియోగిస్తున్న మొత్తం పురుగుమందుల్లో దీని వాటా సుమారు 10 శాతం ఉంది. తెలంగాణతో పాటు , ఏపీ, యూపీ, మహారాష్ట్ర, పంజాబ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో దీని వినియోగం మరింత ఎక్కువగా ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 2,58,000 టన్నుల క్లోర్‌పైరిఫాస్ ఉత్పత్తి చేసినట్లు గణాంకాలు చెప్తున్నాయి. 2022లో నిర్వహించిన ఒక అధ్యయనంలో తెలంగాణలో క్లోర్‌పైరిఫాస్ ఏకంగా 23 పంటలపై వాడుతున్నట్లు తేలింది. కూరగాయలు, పండ్లపై ఉండే దీని అవశేషాలు మెదడు, నాడీ వ్యవస్థపై దాడి చేస్తున్నట్లు పలు స్టడీస్తేల్చాయి.
ఈ రసాయనానికి దీర్ఘకాలం గురైన వ్యక్తుల్లో బ్రెయిన్ స్ట్రోక్, మతిమరుపు, పక్షవాతం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. గర్భిణులపై దీని ఎఫెక్ట్ వల్ల పిండంలో మెదడు లోపాలకు కారణమవుతుందని శాస్త్రీయ ఆధారాలున్నాయి. దీంతో ఏకంగా 40 దేశాలు ఈ రసాయనాన్ని నిషేధించినప్పటికీ భారత్‌లో మాత్రం వాడుకలో ఉంది. జెనీవాలో ఏప్రిల్ 28 నుంచి మే 9 వరకు జరుగుతున్న బాసెల్, రొటర్‌డామ్, స్టాక్‌హోమ్ కన్వెన్షన్‌ల సమావేశాల్లో క్లోర్పైరిఫాస్ను స్టాక్‌హోమ్ కన్వెన్షన్ యానెక్స్ ఏ కింద లిస్టు చేసి.. గ్లోబల్ బ్యాన్ విధించాలని పెస్టిసైడ్ యాక్షన్ నెట్‌వర్క్ (ప్యాన్) డిమాండ్ చేస్తున్నది. ఈ రసాయనానికి ప్రత్యామ్నాయంగా సేంద్రియ పురుగుమందులు అందుబాటులో ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్లోర్‌పైరిఫాస్ వినియోగాన్ని నియంత్రిస్తూ, రైతులకు సేంద్రియ పురుగుమందులపై అవగాహన కల్పించాలని వారు సూచిస్తున్నారు.
రైతులకు అవగాహన కల్పించాలి
రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల తోటలు, ఆఖరికి వరి పంటపైనా క్లోర్పైరిఫాస్ను రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే ఈ పురు గు మందును వెంటనే నిషేధించాలి. క్లోర్‌పైరిఫాస్ బ్రెయిన్ స్ట్రోక్‌లకు, ఇతర అనేక వ్యాధులకు కారణమవుతున్నది. చాలా దేశాల్లో దీనిపై నిషేధం విధించినా.. మన దేశంలో వినియోగంలో ఉంది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు కూడా ఎక్కడ దీనిపై రైతులకు అవగాహన కల్పించడం లేదు. క్లోర్పైరిఫాస్తో పాటు మరికొన్ని రసాయనాల అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్