సీసీఈ విధానంలో ఓయూ పీజీ గ్రేడింగ్

సీసీఈ విధానంలో ఓయూ పీజీ  గ్రేడింగ్

హైదరాబాద్, వెలుగు: వర్సిటీలో స్టూడెంట్ల నైపుణ్యాల ఆధారంగా  మార్కులు వేసే విధానాన్ని తీసుకురానున్నట్లు ఉస్మానియూ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్  తెలిపారు. ప్రాజెక్టులు, అసైన్ మెంట్లు, గ్రూప్ డిస్కషన్స్, అటెండెన్స్, వ్యక్తిగత నైపుణ్యాల వంటి అంశాల ఆధారంగా విద్యార్థికి గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. పీజీ కోర్సుల్లో నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్​లో  రిజిస్ర్టర్ లక్ష్మీనారాయణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. 

మార్కెట్ అవసరాలకు అనుగుణంగా  విద్యలో కొత్తగా ప్రాఫెసర్ ఆఫ్  ప్రాక్టీస్ విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా స్టూడెంట్లకు ఇండస్ర్టీ సీఈవోలు, సీనియర్ ఎంప్లాయీస్ పాఠాలు చెప్తారని వివరించారు. వర్సిటీలో రెండేండ్ల కాలంలో రూ.144 కోట్లతో మౌలిక వసతులు కల్పించినట్లు రవీందర్ తెలిపారు. సీఎస్​ఆర్ ద్వారా రూ.20కోట్ల నిధులు సమకూరాయన్నారు. మరో  రూ.500 కోట్ల ఇన్​ఫాస్ర్టక్చర్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. ఓయూలో 21 పాయింట్ల ఎజెండా ఆధారంగా ముందుకు పోతున్నామని వివరించారు. ఇప్పటికే అడిక్ మెట్ నుంచి ఆంధ్ర మహిళా సభ కాలేజీ వరకూ బైపాస్ రోడ్ శాంక్షన్ అయిందని రవీందర్ పేర్కొన్నారు.