జూ. ఎన్టీఆర్ పులిలా ఉంటారు..చరణ్ చిరుతను తలపిస్తారు

జూ. ఎన్టీఆర్ పులిలా ఉంటారు..చరణ్ చిరుతను తలపిస్తారు

RRRలోని నాటు నాటు సాంగ్..ఎంతో హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్..మాస్ డ్యాన్స్తో  ఇరగదీశారు. స్టెప్పులతో  దేశాన్ని ఊపేశారు. అంతేకాదు వివిధ భాషల్లో విడుదలై..అక్కడ కూడా నాటు నాటు సాంగ్ అందరితో స్టెప్పులేయించింది. ఇక పాట  గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023 సైతం దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఈ నాటు నాటు విజయం వెనుక కష్టం ఎంత ఉందో తెలుసా..?  4 నిమిషాల 34 సెకన్ల పాట వెనుక ఎన్ని టేకులు తీసుకున్నారు..?  ఎన్ని రోజులు చిత్రీకరించారో  తెలుసా...?

వంద రకాల స్టెప్పులు..

నాటు నాటు అంటే గుర్తొచ్చేది జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్. తెరపైన ఈ పాటకు వీరిద్దరు ప్రాణం పోస్తే.. ఈ పాట హిట్ కావడంలో తెర వెనకాల కృషి చేసింది  కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్. ఈ పాట కోసం ఏకంగా వంద రకాల హుక్ స్టెప్స్ సిద్ధం చేసుకున్నాని ప్రేమ్ రక్షిత్ అన్నారు. నాటు నాటు సాంగ్ కోసం రెండు నెలల పాటు రిహార్సల్స్ చేసి స్టెప్పులను పర్ఫెక్ట్ గా తీర్చిదిద్ది 20 రోజుల పాటు..ఉక్రెయిన్ లోని  కైవ్‌ మారిన్స్కీ ప్యాలెస్ లో నాటు నాటు సాంగ్ షూటింగ్ నిర్వహించామన్నారు. 

రాజమౌళి చెప్పిన ప్రకారమే..

నాటు నాటు సాంగ్ గురించి తనకు రాజమౌళి క్లుప్తంగా వివరించారని ప్రేమ్ రక్షిత్ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ పులిలా ఉంటారని..చరణ్ చిరుతలా ఉంటారని..వాటిని దృష్టిలో పెట్టుకుని కొరియోగ్రఫీ చేయాలన్నట్లు చెప్పారు. ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసేలా చూసుకోవాలని రాజమౌళి చెప్పారని..ఆయన చెప్పిన ప్రకారమే డ్యాన్స్ కంపోజ్ చేసినట్లు వెల్లడించారు. హీరోలపై ఏకాగ్రత..వారి బంధం, వారి శక్తిని ప్రతిభించేలా డ్యాన్స్ ఉండాలని రాజమౌళి అన్నారని తెలిపారు.  నాటు నాటు సాంగ్ కోసం తీర్చిదిద్దిన స్టెప్స్ పై రాజమౌళి సంతృప్తి చెందడానికి కనీసం 20 టేకులు పట్టిందని ప్రేమ్ రక్షిత్ అన్నారు. అప్పటి వరకు ఆయన మరో టేక్ మరో టేక్ అంటూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. నాటు నాటు టీమ్ పొద్దున 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు షూట్ లో పాల్గొందన్నారు. ప్యాక్ అప్ తర్వాత మరో మూడు గంటలు రిహార్సల్ చేసినట్లు చెప్పారు. 

ఇద్దరూ ఇద్దరే..

టాలీవుడ్‌లో నటనతో పాటు డ్యాన్స్‌లోనూ  అలరించగల స్టార్స్‌  ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అని ప్రేమ్ రక్షిత్ అన్నారు. వీరిద్దరు కలిసి ఉన్న పాటకు తాను స్టెప్పులు కంపోజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. రాజమౌళి తన గురువు అని తెలిపాడు. తనకు కెమెరా యాంగిల్స్ నేర్పింది ఆయనే అని..తనపై నమ్మకముంచిన రాజమౌళికి ధన్యవాదాలు చెప్పారు. ఇద్దరు పెద్ద హీరోలు కావడంతో పాట చేయడానికి భయపడ్డానని..అయితే రాజమౌళి తనలో ధైర్యాన్ని నింపారని వెల్లడించారు.