Healthy Food: తొక్కే కదా తీసేయద్దు.. చుక్కకూర, చెన్నంగి తొక్కు పచ్చడి.. లొట్టలేయాల్సిందే..!

Healthy Food: తొక్కే కదా తీసేయద్దు.. చుక్కకూర, చెన్నంగి తొక్కు పచ్చడి.. లొట్టలేయాల్సిందే..!

వేడివేడి అన్నంలో  తొక్కుడు పచ్చడి, నెయ్యి కలుపుకుని తింటుంటే... స్వర్గం కనిపిస్తుంది. ఆ పచ్చళ్లు కూడా నిల్వ ఉండేవి కాకుండా అప్పటికప్పుడు తయారుచేసుకున్నవైతే...! ప్రత్యేకంగా చెప్పేదేముంది? కానీ... ఈ ఇన్​స్టంట్ తొక్కుల్ని చేయడం కూడా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కొందరు. అలాంటి వాళ్లకోసమే సింపుల్గా చేసుకునే తొక్కు వెరైటీలు మీకోసం.. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. . .!

చెన్నంగి ఆకు తొక్కు తయారీకి కావలసినవి

  • చెన్నంగి ఆకులు - రెండు కప్పులు
  • ఎండుమిర్చి - ఎనిమిది 
  • జీలకర్ర- రెండు టేబుల్ స్పూన్లు
  •  ఆవాలు, ధనియాలు, శెనగపప్పు - ఒక్కోటి ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున
  •  కరివేపాకు రెబ్బలు -కొన్ని
  •  చింతపండు - అర కప్పు

తయారీ విధానం: నూనె వేడిచేసి అందులో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, శెనగపప్పు, కరివేపాకు వేసి దోరగా వేగించాలి. చల్లారాక మిక్సీలో వేసి పొడి పట్టాలి. కడిగి పెట్టుకున్న చెన్నంగి ఆకులు వేగించాలి. చింతపండును కూడా బాగా కడిగి వేగుతున్న ఆకుల్లో వేసి మగ్గించాలి. ఆకు ఉడికాక స్టవ్ ఆపేయాలి. చల్లారాక చెన్నంగి ఆకును కచ్చాపచ్చాగా దంచి ముందు పట్టిన పొడిని కలపాలి. అందులో సరిపడా ఉప్పు కలుపుకుంటే టేస్టీ టేస్టీ చెన్నంగి తొక్కు రెడీ..

చుక్కకూర తొక్కు  తయారీకి కావాల్సినవి

  • చుక్కకూర - నాలుగు కట్టలు
  •  ఎండుమిర్చి - ఎనిమిది 
  • జీలకర్ర, మినపప్పు, ధనియాలు, శెనగపప్పు - ఒక్కోటి ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున
  • నూనె, ఉప్పు - తగినంత

తయారీ విధానం: పాన్ లో నూనె వేడిచేసి ఎండుమిర్చి.. జీలకర్ర, మినపప్పు, ధనియాలు, శెనగపప్పు వేగించాలి. ఇందులో కొంచెం కరివేపాకు, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. పాన్​ లో  నూనె వేసి తరిగిన చుక్కకూర వేగించాలి. కూర మెత్తగా అయ్యేంతవరకూ కలుపుతూనే ఉండాలి. చుక్కకూర రంగు మారగానే అందులో మిక్సీ పట్టిన పొడి వేసి కలపాలి. కావాలంటే వెల్లుల్లి రెబ్బలు, ఇంగువతో తాలింపు వేసుకోవచ్చు. ఇవి  రుచికి.. రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా..!  ఇలాంటి తొక్కడు పచ్చలంటే ఎవరైనా లొట్టలేయాల్సిందే కదా..!