టెర్రరిస్టులను వెంటాడి తుదముట్టిస్తం.. పహల్గాం దాడికి ప్రతీకారం తప్పదు.. కేంద్ర మంత్రి అమిత్ షా వార్నింగ్​

టెర్రరిస్టులను వెంటాడి తుదముట్టిస్తం.. పహల్గాం దాడికి ప్రతీకారం తప్పదు.. కేంద్ర మంత్రి అమిత్ షా వార్నింగ్​
  • ఎక్కడ దాక్కున్నా పట్టుకొని శిక్షిస్తం

న్యూఢిల్లీ:పహల్గాం ఉగ్రదాడి యావత్​ దేశాన్ని కలచివేసిందని, టెర్రరిస్టులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. టెర్రరిజాన్ని అంతమొందించడమే తమ లక్ష్యమని హెచ్చరించారు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నావెంటాడుతామని చెప్పారు. అస్సాం బోడో కమ్యూనిటీ లీడర్​ ఉపేంద్రనాథ్ బ్రహ్మ విగ్రహాన్ని గురువారం ఢిల్లీలో అమిత్​ షా ఆవిష్కరించారు. 

ఆయన గౌరవార్థం ఓ రోడ్డుకు ఉపేంద్రనాథ్​ బ్రహ్మ పేరు పెట్టారు. ఈ సందర్భంగా అమిత్​ షా తొలిసారి పహల్గాం ఘటనపై బహిరంగంగా మాట్లాడారు. ‘‘పహల్గాం దాడి.. పిరికిపందల చర్య. ఆ దాడితో వాళ్లు(టెర్రరిస్టులు) విజయం సాధించినట్లు భావిస్తే.. వాళ్లకు ఒకటే చెప్పదలచుకున్న. మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం మిమ్మల్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోదు! ప్రతీకారం తప్పదు. మూల్యం చెల్లించుకోవాల్సిందే” అని హెచ్చరించారు.

టెర్రరిస్టులు ఎక్కడున్నా తప్పించుకోలేరని, వెంటాడి తుదముట్టిస్తామని అమిత్ షా అన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి మద్దతుగా 140 కోట్ల మంది భారతీయులతోపాటు ప్రపంచం మొత్తం భారత్ వెంట ఉందని తెలిపారు. పహల్గాం దాడికి కారకులైనవారు ఏ మూలన దాక్కున్నా.. తగిన శిక్ష తప్పకుండా పడుతుందని, వారికి సపోర్ట్​ చేసేవారికి భయమంటే ఏమిటో రుచిచూపిస్తామని అమిత్​ షా హెచ్చరించారు. దేశంలోని ప్రతి అంగుళం నుంచి టెర్రరిజాన్ని తుడిచిపెట్టేస్తామని అన్నారు.