హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావుకు బిగుస్తున్న ఉచ్చు

హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావుకు బిగుస్తున్న ఉచ్చు
  • సంతకాల ఫోర్జరీ, నిధుల గోల్‌మాల్‌, ఎస్‌ఆర్‌‌హెచ్‌ మేనేజ్‌మెంట్‌ను బెదిరించిన కేసుల్లో అరెస్టు చేసిన సీఐడీ
  • మరో నలుగురు నిందితులు కూడా.. ఈ నెల 22 వరకు రిమాండ్‌  
  • టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి ఫిర్యాదుతో గుట్టురట్టు
  • శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కృష్ణ యాదవ్‌ సంతకాలు ఫోర్జరీ చేసి హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి ఎన్నిక  
  • రెండేండ్లలో రూ.170 కోట్లు గోల్‌మాల్‌ చేశారనే ఆరోపణలు 
  • పరారీలో హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్

హైదరాబాద్‌, వెలుగు: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్​మోహన్​ రావు చుట్టూ సీఐడీ ఉచ్చు బిగిస్తున్నది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా  జగన్‌మోహన్‌ రావు నియామకం, నిధుల గోల్‌మాల్‌, కాంప్లిమెంటరీ టికెట్ల కోసం బ్లాక్‌ మెయిలింగ్‌ సహా క్రికెట్‌ అసోసియేషన్  కేంద్రంగా జరిగిన అక్రమాల గుట్టు విప్పుతున్నది. ఐపీఎల్‌ టికెట్ల వివాదంతో పాటు ఫోర్జరీ కేసుల్లో జగన్‌మోహన్‌రావు, ట్రెజరర్‌‌ జేఎస్‌ శ్రీనివాసరావు, సీఈవో సునీల్‌ కంటే, శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ జనరల్‌ సెక్రటరీ రాజేందర్‌ యాదవ్‌, ఆయన భార్య (శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ అధ్యక్షురాలు) కవితను బుధవారం అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. గురువారం వాళ్లకు గాంధీ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కవితను చంచల్‌గూడలోని మహిళా జైలుకు, మిగతా నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా, మరో నిందితుడైన హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం సీఐడీ అధికారులు గాలిస్తున్నారు.  

మాజీ మంత్రి కృష్ణయాదవ్‌ సంతకం ఫోర్జరీ..  

గౌలిపురా క్రికెట్‌ క్లబ్‌గా పిలిచే  శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా గతంలో మాజీ మంత్రి కృష్ణయాదవ్‌ పని చేశారు. అదే క్లబ్‌కు కృష్ణ యాదవ్ సోదరుడు రాజేందర్‌‌ యాదవ్‌ జనరల్‌ సెక్రటరీగా, ఆయన భార్య కవిత అధ్యక్షురాలిగా ఉన్నారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే ఏదైనా క్రికెట్‌ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రపోజ్​చేయాల్సి ఉంటుంది. దీంతో జగన్‌మోహన్‌ రావును ఎన్నికల్లో పోటీ చేసేందుకు శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ అధ్యక్షుడు కృష్ణయాదవ్‌  ప్రపోజ్​చేసినట్టుగా ఆయన సంతకాలతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృషించారు. ఇందుకు రాజేందర్‌‌ యాదవ్‌, కవిత సహకరించారు. ఆ ఫోర్జరీ  డాక్యుమెంట్లును చూపి జగన్‌మోహన్‌ రావు హెచ్‌సీఏ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఉప్పల్‌ స్టేడియం కేంద్రంగా హెచ్‌సీఏ అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

టీసీఏ సెక్రటరీ ఫిర్యాదుతో గుట్టురట్టు.. 
జగన్‌మోహన్‌ రావు అక్రమాలపై తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌(టీసీఏ) జనరల్‌ సెక్రటరీ ధర్మ గురువారెడ్డి సీఐడీకి  ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జూన్‌ 10న సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఐపీసీ 465, 468, 472, 403, 409, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిగా హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రావు , రెండో నిందితుడిగా ట్రెజరర్‌‌ శ్రీనివాస రావు, మూడో నిందితుడిగా సీఈవో సునీల్‌ కంటేతో పాటు శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్ అధ్యక్షురాలు కవిత, ఆమె భర్త రాజేందర్‌‌ను నిందితులుగా చేర్చారు. వీరంతా కలిసి హెచ్‌సీఏలో అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు సేకరించారు. 

సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లను జగన్‌మోహన్‌రావు సృష్టించాడు. వీటి ఆధారంగానే ఆయన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని గుర్తించారు. ఆ తర్వాత హెచ్‌సీఏ సీఈవో సునీల్‌ కంటే, ట్రెజరర్‌ శ్రీనివాస రావు ఇతరులతో కలిసి నిధుల గోల్‌మాల్‌కు పాల్పడ్డారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా కాంప్లిమెంటరీ టికెట్ల కోసం బ్లాక్‌ మెయిల్‌, కార్పొరేట్‌ బాక్స్‌లను తమ అధీనంలో పెట్టుకోవడం కోసం ఫ్రాంచైజీలను వేధించినట్లు ఆధారాలు సేకరించారు.

రెండేండ్లలో రూ.170 కోట్లు గోల్‌మాల్‌! 
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్‌ మోహన్‌రావు సహా నిందితులు అంతా కలిసి రెండేండ్లలో దాదాపు రూ.170 కోట్ల మేర గోల్‌మాల్ చేసినట్టు సీఐడీ ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. ఆటగాళ్ల ఎంపికలో అవినీతి జరిగిందని, ఆటగాళ్ల తల్లిదండ్రులు నుంచి హెచ్‌సీఏ సభ్యులు డబ్బులు వసూలు చేశారని గుర్తించినట్టు సమాచారం. చెక్ పవర్‌‌ దుర్వినియోగం, బీసీసీఐ ద్వారా వచ్చిన నిధుల్లో గోల్‌మాల్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ నుంచి కాంప్లిమెంట్రీ పాస్‌లను బ్లాక్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. 

క్రీడాకారుల కోసం  ఉపయోగించాల్సిన కాంప్లెమెంటరీ పాస్‌లలోనూ భారీ ఎత్తున అవినీతి తదితర అంశాలపై సీఐడీ ఫోకస్‌ పెంచినట్టు సమాచారం. తమను వేధించారంటూ జగన్‌మోహన్‌రావుపై ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాళ్ల స్టేట్‌మెంట్లను కూడా సీఐడీ అధికారులు రికార్డు చేసినట్టు తెలిసింది. దర్యాప్తులో భాగంగా నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.