- ఢిల్లీ, పంజాబ్, గుజరాత్‌లో మ్యూల్ అకౌంట్ల ఆపరేటర్లు
- డఫాబెట్ యాప్‌లో 10 లక్షల మంది బెట్టింగ్ మెంబర్లు
- ఫిలిప్పీన్స్‌లో యాప్ రూపొందించి, యూకే నుంచి ఆపరేషన్
- 1.5 శాతం కమీషన్ చొప్పున రోజుకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల సంపాదన
- యాప్‌పై దేశవ్యాప్తంగా 225 ఫిర్యాదులు.. 73 క్రిమినల్ కేసులు
- రెండు వారాలపాటు సీఐడీ స్పెషల్ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్
- రాష్ట్రంలో 108 బెట్టింగ్ యాప్స్ బ్లాక్, 37 జియో ఫెన్సింగ్
- 25 మంది సెలబ్రిటీలకు సీఐడీ కౌన్సెలింగ్
హైదరాబాద్, వెలుగు: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసుల్లో సీఐడీ దూకుడు పెంచింది. యాప్స్ నిర్వాహకులు, మ్యూల్ అకౌంట్లు టార్గెట్‌గా ఢిల్లీ, గుజరాత్, పంజాబ్‌లో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించింది. ఇందులో 25 మంది సెలబ్రిటీలపై నమోదైన బెట్టింగ్ యాప్స్ కేసులతోపాటు కరీంనగర్‌లో నమోదైన ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించి ఆఫ్గనిస్తాన్‌కు చెందిన సైబర్ నేరగాడు సహా మొత్తం 11 మందిని అరెస్ట్ చేసింది. వీరివద్ద బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, కియా సెల్టోస్ కార్లతో పాటు ల్యాప్‌టాప్‌లు, 26 మొబైల్ ఫోన్లు, 5 పాస్‌పోర్టులు, రూ.3.21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ వివరాలను సీఐడీ డీజీ చారుసిన్హా సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు చెప్పారు. కాగా, తాము ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్‌పై రాష్ట్రంలో నిషేధం ఉన్న సంగతి తమకు తెలియదని సెలబ్రిటీలు చెప్పినట్టు డీజీ తెలిపారు. నిషేధిత యాప్స్‌ను మరోసారి ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్టు చెప్పారు.
10 లక్షల మంది బెట్టింగ్ రాయుళ్లు..
కరీంనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చల్లా సాయికృష్ణారెడ్డి ‘డఫాబెట్’ యాప్‌లో బెట్టింగ్ పెట్టాడు. భారీ లాభాలు వస్తాయని నమ్మి 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు ఏడాది పాటు బెట్టింగ్‌లో పాల్గొని రూ.9.95 లక్షలు కోల్పోయాడు. దీంతో బాధితుడు స్థానిక పోలీసులను ఆశ్రయించగా సీఐడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రంగంలోకి దిగింది. బాధితుడు సాయికృష్ణారెడ్డి అకౌంట్ల నుంచి ట్రాన్స్‌ఫర్ జరిగిన లావాదేవీలతోపాటు బెట్టింగ్ డబ్బు డిపాజిట్‌అయిన మ్యూల్ అకౌంట్ల ఆధారంగా సెర్చ్ ఆపరేషన్ చేసింది.
40 మంది పోలీసులతోపాటు 6 సీఐడీ బృందాలు ఢిల్లీ, గుజరాత్, పంజాబ్‌లో సోదాలు నిర్వహించాయి. ఈ మూడు రాష్ట్రాల్లో డఫాబెట్‌యాప్ మూలాలు ఉన్నట్లు గుర్తించారు. ఫిలిఫిన్స్‌లో రూపొందించిన డఫాబెట్ యాప్ ప్రస్తుతం యూకే నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు తెలుసుకున్నారు. ఈ యాప్ ద్వారా క్రికెట్, క్యాసినో గేమ్స్, ఏవియేటర్‌లాంటి గేమ్‌లపై బెట్టింగ్ చేయిస్తూ తక్కువ సమయంలో అధిక లాభాలు, బోనస్‌లు, ప్రత్యేక ఆఫర్ల పేరిట యువతను ట్రాప్ చేస్తున్నట్టు సీఐడీ దర్యాప్తులో వెలుగు చూసింది. ఇందులో దాదాపు 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు వెల్లడైంది.
దేశవ్యాప్తంగా 225 ఫిర్యాదులు.. 73 క్రిమినల్ కేసులు..
డఫాబెట్ బెట్టింగ్ యాప్‌పై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ)లో ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, బిహార్ తదితర రాష్ట్రాల్లో 225 ఫిర్యాదులు, 73 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. బ్యాంకు ఖాతాల ద్వారా మనీ ట్రయల్ కోసం నిందితులు 8 స్థాయిల్లో విస్తరించిన 46 మ్యూల్‌ఖాతాలను వినియోగించారు. ఈ ఖాతాల ద్వారా బెట్టింగ్ డబ్బును సేకరించి మళ్లించినట్టు సీఐబీ దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ మేరకు బ్యాంకు లావాదేవీలు, మొబైల్ నంబర్లు, ఈ- మెయిల్ ఐడీలు, సోషల్ మీడియా ఖాతాలు, వాట్సాప్ గ్రూపుల ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించిన డఫాబెట్‌క్రైమ్ నెట్‌వర్క్‌ను ట్రేస్ చేశారు.
ఢిల్లీ, గుజరాత్, పంజాబ్‌లో మ్యూల్ అకౌంట్లు, 11 మంది ఆపరేటర్లు..
యూకే నుంచి ఆపరేట్ చేస్తున్న డఫాబెట్‌ను ఇక్కడ గుజరాత్‌కు చెందిన మనీశ్‌సింగ్(24), అభిషేక్ సింగ్(26) నిర్వహిస్తున్నారు. యూపీఐ, క్యూ ఆర్ కోడ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు వసూలు చేసి.. మొదట చిన్న మొత్తాల్లో గెలిపించి, తర్వాత పెద్ద మొత్తాలు పెట్టేలా ప్రలోభపెట్టినట్టు సీఐడీ దర్యాప్తులో వెలుగు చూసింది. కాగా, వీరికి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ కోసం గుజరాత్ గాంధీనగర్‌కు చెందిన అజిత్ సింగ్, విజయ్ పాటిదార్, యుగల్ పాటిదార్, ప్రతీక్ ప్రవీణ్ భాయ్ సహకరిస్తున్నారు.
ఢిల్లీకి చెందిన ఇగ్నేషియన్ దాస్, అభిషేక్ వాధ్వా, పంజాబ్‌కు చెందిన లవ్‌కుమార్, సిమర్ ప్రీత్ సింగ్ కలిసి మ్యూల్ అకౌంట్లు, నకిలీ సంస్థల పేరిట కరెంట్ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు. వీటి ద్వారా ఒక్కో ట్రాన్సాక్షన్‌కు 1.5 శాతం కమీషన్ చొప్పున రోజుకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సంపాదిస్తున్నట్టు సీఐడీ దర్యాప్తులో బయటపడింది. ఇలాంటి సైబర్ నేరగాళ్లు ఉన్న ప్రాంతాల్లో రెండు వారాలపాటు నిఘా పెట్టారు.
కాగా, సీఐడీ అధికారులను గుర్తించిన సైబర్ నేరగాళ్లు.. తరచూ మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, నివాస ప్రాంతాలు మార్చుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు గత నెల 29న 11 మందిని అరెస్టు చేసి.. హైదరాబాద్ తరలించారు.
