
- హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్ నుంచి కీలక సమాచారం సేకరిస్తున్న సీఐడీ
- మూడో రోజు కస్టడీలోప్రశ్నించిన అధికారులు
హైదరాబాద్,వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిధుల గోల్‌మాల్, అధ్యక్షుడిగా జగన్ మోహన్ రావు ఎన్నికపై సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో రెండో నిందితుడైన హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్ రామ్‌చందర్ నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు. దేవరాజ్‌ను ఏడు రోజుల కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గురు, శుక్రవారాల్లో రెండు రోజుల పాటు ప్రశ్నించారు. మూడో రోజు శనివారం కూడా విచారించారు.
బీసీసీఐ గ్రాంట్ల వినియోగం, స్టేడియం నిర్వహణకు సంబంధించి కాంట్రాక్టులు సహా ఆర్థికపరమైన అంశాల్లో నిందితుడు కీలకంగా వ్యవహరించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. జగన్ మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే కస్టడీలో వెల్లడించిన వివరాల ఆధారంగా దేవరాజ్‌ను ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధితో పాటు యువ ఆటగాళ్లను వెలికితీసేందుకు జరపాల్సిన సమ్మర్ క్యాంపుల నిర్వహణలోనూ అవినీతి జరిగినట్టు సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది.
ఏటా ఎన్ని సమ్మర్ క్యాంపులు నిర్వహించారు, వాటికి సంబంధించిన ఖర్చులు, క్రికెటర్ల ఎంపిక గురించి దేవరాజ్ ను ప్రశ్నించారు. అలాగే క్రికెట్ బాల్స్ కొనుగోలు, ఇతర మౌలికవసతుల ఏర్పాటు అవకతవకలపైనా సమాచారం సేకరించారు. ప్రధానంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి హెచ్‌సీఏకి వచ్చిన నిధులు, అడ్వర్టైజ్ మెంట్ ఏజెన్సీలు సహా ఇతర ఆర్థిక వనరులపై ఆరా తీస్తున్నారు. ఐపీఎల్ నిర్వహణ కోసం బీసీసీఐ నుంచి ఏటా హెచ్‌సీఏకు రూ.100 కోట్ల వరకు గ్రాంట్స్ వస్తాయని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి ఇప్పటికే సీఐడీకి ఆధారాలు అందించారు.