- కరీంనగర్ సీపీ గౌస్ ఆలంపై మతవిద్వేష వ్యాఖ్యలపై విచారణ
- 4న హాజరుకావాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ ఉచ్చు బిగుస్తోంది. విధి నిర్వహణలో ఉన్న కరీంనగర్ సీపీ గౌస్ ఆలంపై మత విద్వేష వ్యాఖ్యలు చేయడాన్ని ఐపీఎస్ అధికారుల సంఘంతో పాటు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో సీఐడీతో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా సీఐడీ ఎంక్వైరీ ప్రారంభించింది.
ఇందులో భాగంగా సీఐడీ డీఎస్పీ రంగస్వామి మంగళవారం కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 4న ఉదయం 11-.30 గంటలకు హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సమ్మక్క జాతర సమయంలో హంగామా..
సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జనవరి 29న హుజూరాబాద్ క్యాంప్ చౌరస్తాలో కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి రోడ్డుపై ధర్నా చేశారు. ఆ సమయంలో సమక్క,సారలమ్మల జాతరకు వెళ్లే భక్తులతో పాటు స్థానికులకు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కాగా, ట్రాఫిక్ క్లియర్ చేయడంతో పాటు వివిధ ప్రాంతాల్లో రోడ్లపై బైఠాయించిన కౌశిక్ రెడ్డి సహా ఆయన అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో ఉన్న స్థానిక పోలీసులు, కరీంనగర్ సీపీ గౌస్ ఆలంతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.
గౌస్ ఆలం మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలపై బీఎన్‌ఎస్‌లో పలు సెక్షన్ల కింద హూజూరాబాద్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. కేసు తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. కేసు విచారణను సీఐడీకి బదిలీ చేసింది. కాగా, సీఐడీ జారీ చేసిన నోటీసులపై కౌశిక్ రెడ్డి స్పందించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా .. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని పేర్కొన్నారు.
