
దక్షిణాది సినీ ఇండస్ట్రీకి, రాజకీయాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా తమిళనాట ఉన్న బంధాన్ని వేరు చేసి చూడలేం. ఈ రెండింటికీ అంత అవిభాజ్య సంబంధం ఉంది. ప్రఖ్యాత దివంగత నేతలు కామరాజర్, అన్నాదురై నుండి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వరకు సినీ రంగాన్ని దగ్గరగా చూసినవారే. ఇప్పుడు కూడా చాలా మంది నటీనటుల దృష్టి రాజకీయాలపైనే ఉంది.
విజయ్ రాజకీయ అరంగేట్రంతో మొదలైన అగ్గి!
లేటెస్ట్ గా తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుండి తమిళనాట రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. మరో ఏడెనిమిది నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా మరింత దూకుడుగా దూసుకుపోతున్నారు. అయితే ఇటీవల దురదృష్టవశాత్తు జరిగిన తొక్కిసలాట సంఘటన అందరని కలిచి వేసింది. మృతుల సంఖ్య అనేక చర్చలకు దారితీసింది. ఇది కేవలం రాజకీయ వర్గాల్లోనే కాక, సినీ పరిశ్రమలోనూ విమర్శలు, ప్రతి విమర్శలతో వేడి పుట్టిస్తోంది.
సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు
ఈ వేడికి మరింత ఆజ్యం పోస్తూ.. సీనియర్ నటుడు సత్యరాజ్ (Sathyaraj) సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యరాజ్ తన సోషల్ మీడియాలో పరోక్షంగా విజయ్‌ను విమర్శిస్తూ ఒక పోస్ట్ చేశారు. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ నాయకులుగా మారాలనుకునే నటులను ఉద్దేశించినట్లుగా ఉన్నాయి. "నటులను తలపై పెట్టుకొని ఊరేగకండి. వారికి చాలా తెలుసని మీరు భావించకండి. నటించడం మాత్రమే తెలుసు. ఈ సమాజంలో జరుగుతున్న పెద్ద తప్పు, నటులను ఐన్‌స్టీన్ రేంజ్‌లో భావించడమే. మమ్మల్ని నెత్తినెక్కించుకోకండి. మేము కేవలం మా పాత్రలకు న్యాయం చేస్తాం అంతే. మేము పెరియార్, అంబేడ్కర్ కాదని గుర్తుంచుకోవాలి."
సత్యరాజ్ కు పేరరసు కౌంటర్..
సత్యరాజ్ వంటి సీనియర్ నటుడు చేసిన ఈ వ్యాఖ్యలు తమిళ సినీ-రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం సృష్టించాయి. 'మీరూ నటులే కదా.. ' అంటూ దర్శకుడు పేరరసు కౌంటర్ ఇచ్చారు. నటులకు ఏమీ తెలియదు, ఒట్టి మట్టే అంటే ఎలా? మీరు కూడా నటులే కదా! మరి మీరు రాజకీయ సందేశం ఇవ్వడానికి ఎందుకు సిద్ధమయ్యారు?. ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇలా అనే ధైర్యం ఉండేదా? మీరు కూడా ఎంజీఆర్‌ను చూసి రాజకీయాల్లోకి వచ్చినవారు కాదా? ప్రశ్నించారు.
కమలహాసన్‌కు రాజ్యసభలో ఎంపీ పదవి ఇవ్వాలని, మీరు డీఎంకే పార్టీని గట్టిగా అడగాల్సింది. పార్టీ కోసం ఎంతో శ్రమించిన వాళ్లు ఉండగా, వారి కూతుళ్లకు పదవులు ఇవ్వకుండా సత్యరాజ్ కూతురికి పదవి ఎందుకు ఇచ్చారని మీరు డీఎంకే పార్టీని నిలదీయాలి కదా అంటూ పేరరసు ప్రశ్నించారు. నటన అనేది ఒక వృత్తి మాత్రమే అయినా, ఆ రంగంలో కూడా ప్రపంచ జ్ఞానం కలవారు ఎందరో ఉన్నారు. వారిని అరకొర తెలిసిన వాళ్లు అని కించపరచడం సరికాదు హితవు పలికారు.
దర్శకుడు పేరరసు వ్యాఖ్యలు, సినీ రంగంలో వ్యక్తుల రాజకీయ జోక్యం, వారసత్వ రాజకీయాలు, మేధస్సుగురించి లోతైన చర్చకు దారితీశాయి. ఒక నటుడు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలా? లేదా కేవలం నటించడానికే పరిమితం కావాలా? అనే అంశంపై ఈ వివాదం కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. ఈ రగడ తమిళ రాజకీయాల వేడిని మరింత పెంచిందోంది. ఈ రాజకీయ రగడ ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.