Cyber Crime : తెలంగాణ జనం డబ్బు రోజుకు రూ.3 కోట్లు దోచేస్తున్నారు

Cyber Crime : తెలంగాణ జనం డబ్బు రోజుకు రూ.3 కోట్లు దోచేస్తున్నారు

మన అకౌంట్ మన దగ్గరే ఉంటుంది.. మన డబ్బు మన దగ్గరే ఉంటుందని భావిస్తాం.. బ్యాంక్ అకౌంట్ లోని డబ్బును ఎవడ్రా కొట్టేసేది అనే ధీమా.. ఇప్పుడు అలా లేదు.. తెలంగాణ జనం డబ్బు అకౌంట్ల నుంచి మాయం అవుతుంది.. మన అత్యాశ, మన అశ్రద్ధ.. మన నిర్లక్ష్యంతో జనం డబ్బు మాయం అవుతుంది.. ప్రతి రోజూ అంటే ప్రతి 24 గంటలకు అక్షరాల 3 కోట్ల 30 లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.. గత ఐదు వారాలుగా.. అంటే 35 రోజులుగా.. ప్రతి రోజు 3 కోట్ల 30 లక్షల రూపాయల చొప్పున.. అక్షరాల 150 కోట్ల రూపాయలు దోచేశారు సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది.

సైబర్ నేరగాళ్లు ఎలా వల వేస్తున్నారు ?
సైబర్ నేరగాళ్ల చేతికి జనం ఎలా చిక్కుతున్నారు అనే ప్రశ్న రావొచ్చు. మీకు మొబైల్ ఉందా.. ఉంటే ఈ గేమ్ ఆడండి.. రోజుకు 500 రూపాయలు సంపాదించొచ్చు అని లింక్స్ పంపిస్తారు. ఆశతో ఓపెన్ చేస్తారు.. వాళ్లు చెప్పినట్లు చేస్తారు.. మన అకౌంట్ లో డబ్బులు మాయం అవుతాయి. మీరు ఈ లింక్ ఓపెన్ చేయండి.. లైక్, షేర్ కొట్టండి.. మీకు ప్రతి లైక్ కు 20 రూపాయలు వస్తాయి అంటూ చెబుతారు.. రెండు రోజులు ఇస్తారు.. మూడో రోజు మన అకౌంట్ ఖాళీ అవుతుంది.. కేవైసీ అప్ డేట్ అంటారు.. వాళ్లు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నారు.. అంతే మన బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులు మాయం అవుతున్నాయి.. మనకు లింక్స్ పంపిస్తారు.. ఓపెన్ చేసిన తర్వాత పెట్టుబడి పెట్టండి.. అత్యధిక లాభాలు వస్తాయి అని ఆశ పెడతారు.. అంతే మొత్తం దోచేస్తారు. వీటితోపాటు ఊరు, పేరు లేని నెంబర్ల నుంచి కాల్ చేసి గిఫ్ట్ కూపన్స్ అని.. విదేశీ టూర్లు అని.. స్కాలర్ షిప్స్ అని ఇలా పలు రకాలుగా ఆశ పెట్టి.. మన డబ్బులను కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.. 2024, జనవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు.. జస్ట్ ఈ 35 రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యా్ప్తంగా ఏకంగా 150 కోట్ల రూపాయలను దోచుకువెళ్లారు సైబర్ నేరగాళ్లు.

పరిష్కారం ఏంటీ.. అప్రమత్తంగా ఎలా ఉండాలి
రోజు రోజుకు వస్తున్న కేసుల్లో క్రిమినల్స్ ఎక్కువగా కొత్తకొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరీటి బ్యూరో డైరెక్టర్ షికా గోయిల్ అన్నారు. ప్రజలకు సరైన అవగాహన లేకపోవడతోనే ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్ జరుతున్నాయని, అన్ని విధాల సైబర్ కైమ్స్ పై జనాలకు అవేర్నెస్ కల్పిస్తున్నామని ఉన్నతాధికారులు తెలియజేశారు. ఈ ఫ్రాడ్స్ లో మీరు చిక్కుకోకుండా ఉండటానికి ఈ జాగ్రత్తలు పాటించండి..


> ఆన్ లైన్ లో పేమెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి
> ఎట్టిపరిస్థితుల్లో సోషల్ మీడియాలో వచ్చే అన్ నౌన్ లింక్స్ పై క్లిక్ చేయకూడదు
> తెలియని వ్యక్తుల కాల్స్ కు స్పందిచకూడదు
> OTPలు ఇతరులతో షేర్ చేసుకోవద్దు

> పర్సనల్ డేటా వివిధ వెబ్ సైట్ లో షేర్ చేసుకోవద్దు

>  ఆన్ లైన్ షాపింగ్, మార్కెటింగ్ బిజినెస్, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాధించవచ్చు అనే యాడ్స్ నమ్మకూడదు.

> మొబైల్ ఫోన్ లో స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ పెట్టుకోవాలి.

సింపుల్ గా ఇలా ఫిర్యాదు చేయండి

సైబర్ క్రైమ్స్ ద్వారా దొంగలించబడ్డ డబ్బులో 15శాతం మాత్రమే రికవరీ చేసి బాధితులకు ఇప్పించగలుగుతున్నారు. డబ్బు పోయిన 24 గంటల్లో కంప్లైంట్ ఇస్తే 100 % డబ్బు రికవరీ చేయవచ్చని, క్రైం జరగకుండా ఆపవచ్చని  తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వారు అంటున్నారు. బాధితులు 87126 72222 నెంబర్ కు వాట్సాప్ లో ఫిర్యాదు చేయవచ్చు. www.cybercrime.go.in లో లేదా 1930కి కాల్ చేసి కూడా కంప్లైంట్ చేయవచ్చు.