Anaganaga Oka Raju Review: ‘అనగనగా ఒక రాజు’ రివ్యూ: రాజు గారి ‘సంక్రాంతి’ ప్లాన్ అదిరిందా? నవీన్ పోలిశెట్టి కామెడీ హిట్టా.. ఫట్టా?

Anaganaga Oka Raju Review: ‘అనగనగా ఒక రాజు’ రివ్యూ: రాజు గారి ‘సంక్రాంతి’ ప్లాన్ అదిరిందా? నవీన్ పోలిశెట్టి కామెడీ హిట్టా.. ఫట్టా?

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి,  మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’  .  భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా ఈరోజు ( జనవరి 14, 2026 ) థియేటర్లోకి వచ్చింది.  నవీన్ పోలిశెట్టి తనదైన శైలి కామెడీ టైమింగ్ తో ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద తనకుంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. 'జాతి తర్నాలు' తర్వాత ఆయన నటించిన పక్కా వినోదాత్మక చిత్రం  కావడంతో అభిమానులు అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా? మారి తన దర్శకత్వంతో ప్రేక్షకులను మెప్పించడంతో సక్సెస్ అయ్యారా? తన క్యూట్ అందాలతో మీనాక్షి ఎంత మేరకు ఆకట్టుకుంది?  సినిమా చూసిన సినీ ప్రియుల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాం.. 

కథా నేపథ్యం: పెళ్లి.. ప్లాన్.. అసలు నిజం!

ఈ మూవీ గౌరవపురం అనే ఊరిలో కథ మొదలవుతుంది. రాజు (నవీన్ పోలిశెట్టి) ఒక జమీందారీ కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే, బయటకి ఎంత రాజసం ప్రదర్శించినా, లోపల మాత్రం రాజు ఆర్థిక కష్టాల్లో ఉంటాడు. తన తాత చేసిన విలాసవంతమైన ఖర్చుల వల్ల ఆస్తులన్నీ కరిగిపోయి, రాజు ఇప్పుడు అప్పుల ఊబిలో ఉంటాడు.

ఈ గండం నుంచి గట్టెక్కాలంటే ఏదైనా జాక్‌పాట్ తగలాలని ఎదురుచూస్తున్న రాజుకి చారులత (మీనాక్షి చౌదరి) పరిచయం అవుతుంది. ఆమెకు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయని తెలుసుకున్న రాజు, చాలా ప్లాన్డ్‌గా ఆమెను ప్రేమలోకి దించి పెళ్లికి ఒప్పిస్తాడు. ఒక గ్రాండ్ వెడ్డింగ్ సెటప్‌లో వీరి వివాహం జరగాల్సి ఉండగా, చారులత గురించి ఒక ఊహించని నిజం రాజుకి తెలుస్తుంది. ఆ నిజం ఏమిటి? అప్పుల నుంచి బయటపడాలనుకున్న రాజుకి ఎదురైన కొత్త సవాళ్లు ఏంటి? చివరికి రాజు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు? అన్నదే మిగిలిన కథ.

 నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో

ఈ సినిమా పూర్తిగా నవీన్ పోలిశెట్టి ఎనర్జీపై ఆధారపడి నడుస్తుంది. తన మార్క్ వన్-లైనర్స్, బాడీ లాంగ్వేజ్‌తో థియేటర్లో నవ్వులు పూయించారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కామెడీ బ్లాక్స్ యువతను బాగా ఆకట్టుకుంటాయి.  తనదైన శైలి కామెడీ టైమింగ్ తోపాటు స్టైలిష్ ఎలిమెంట్స్ తో పాటు మరి కొన్ని చోట్ల ఎమోషన్స్ తోనూ.. నవీన్ మెప్పించారు.   సినిమాకి ఆయువుపట్టు నవీన్ నటన. పరిస్థితికి తగ్గట్టుగా ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ పీక్స్‌లో ఉన్నాయంటున్నారు ప్రేక్షకులు.

 ఇక  హీరోయిన్ గా మీనాక్షి  తన అందంతోనే కాకుండా, సెకండ్ హాఫ్‌లో నటనతోనూ మెప్పించిందని ప్రశంసిస్తున్నారు. రావు రమేష్ తన అనుభవంతో మరోసారి అదరగొట్టారు. తన పాత్రలో ఆయన పూర్తిగా ఒదిగిపోయారు.  నవీన్, రావు రమేష్ మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్‌గా ఉన్నాయంటున్నారు. తారక్ పొనప్ప నటన కూడా బాగుంది.  చమ్మక్ చంద్ర, అనంత్, రంగస్థలం మహేష్ తో పాటు మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు. 

మారికి తొలి చిత్రమే అయినా.. 

దర్శకుడు మారి కి ఇది తొలి సినిమా అయినప్పటికీ.. కామెడీని పండించడంలో చేసిన విధానం బాగుందని టాక్ వినిపిస్తోంది. నవీన్ పోలిశెట్టి క్యారెక్టర్ ను చాలా ఫన్నీగా తీర్చిదిద్దిన విధానం ప్లస్ పాయింట్స్ గా నిలిచింది.. ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ తో పాటు కామెడీ సన్నివేశాలు బాగున్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రియులు. ఇక మిక్కీ జె. మేయర్ సంగీతం పర్వాలేదనిపిస్తే, జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ఒక కలర్‌ఫుల్ ఫెస్టివల్ లుక్ తీసుకొచ్చింది. అయితే కథాంశం చాలా సింపుల్‌గా, కొంత వరకు ఊహించదగినదిగా ఉంది. మొదటి భాగంలో ఉన్నంత జోరు రెండో భాగంలో కనిపించదు. కొన్ని చోట్ల స్క్రీన్‌ప్లే నెమ్మదించి సాగతీతగా అనిపిస్తుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రేక్షకుల స్పందన 

సోషల్ మీడియాలో ఈ సినిమాపై మిశ్రమ స్పందన లభిస్తోంది. "సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్" అని కొందరు ప్రశంసిస్తుంటే, "స్టోరీ లైన్ పాతదే అయినా నవీన్ కామెడీ సినిమాని కాపాడింది" అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.ఇది ఒక క్లీన్ కామెడీ మూవీ అని  టాక్ వినిపిస్తోంది. కొంతమంది నెటిజన్లు సినిమాలోని ఒక పాయింట్ విద్యా వ్యవస్థను ప్రశ్నించేలా ఉందని, సుమంత్ పాత్ర ఆలోచింపజేసేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

పక్కా ఫెస్టివల్ ఎంటర్టైనర్

మొత్తంగా చెప్పాలంటే, ‘అనగనగా ఒక రాజు’ ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్తే హాయిగా నవ్వుకునే సినిమా. కథలో పెద్దగా లోతు లేకపోయినా, నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. సంక్రాంతి సీజన్‌లో కుటుంబంతో కలిసి సరదాగా గడపాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్ అంటున్నారు ప్రేక్షకులు. సంక్రాంతి బరిలో దిగిన నవీన్ పొలిశెట్టి ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి మరి.