6 నెలల్లో TCS నుంచి 30వేల మంది టెక్కీలు ఔట్.. గాల్లో లెక్కలు కాదు కంపెనీ చెప్పినవే..

6 నెలల్లో TCS నుంచి 30వేల మంది టెక్కీలు ఔట్.. గాల్లో లెక్కలు కాదు కంపెనీ చెప్పినవే..

టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఉద్యోగుల సంఖ్య గడచిన 6 నెలల కాలంలో ఏకంగా 30వేల 900 మందికి పైగా తగ్గింది. ఇవన్నీ ఊహాగానాలు లేదా గాల్లో లెక్కలు అస్సలు కాదు. ఎందుకంటే కంపెనీ తన అధికారిక త్రైమాసిక ఫలితాల్లో వెల్లడించిన డేటా ప్రకారం వెల్లడైన సమాచారం. అయితే దీనికి లేఆఫ్స్ తో పాటు చాలా మంది ఉద్యోగులు వాలంటరీగా రిజైన్ చేయటం మరో కారణంగా వెల్లడైంది. ఇది ఇప్పుడు భారతీయ ఐటీ రంగంలో పెను సంచలనంగా మారింది. 

దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థలో సెప్టెంబర్ త్రైమాసికంలో సుమారు 19వేల 755 మంది, డిసెంబర్ త్రైమాసికంలో మరో 11వేల151 మంది ఉద్యోగులు నికరంగా తగ్గారు. 5 లక్షల కంటే ఎక్కువ మంది పనిచేస్తున్న సంస్థలో ఇంత భారీ స్థాయిలో ఉద్యోగుల సంఖ్య తగ్గడం గత కొన్నేళ్లలో ఇదే మొదటిసారి. ఒకపక్క ఉద్యోగుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మరోపక్క కంపెనీ కూడా సీనియర్ ఉద్యోగుల రిక్రూట్మెంట్లను భారీగా తగ్గించిందని తేలింది. 

ALSO READ : TCS టెక్కీ షాకింగ్ స్టోరీ..

ఈ తగ్గింపు వెనుక ప్రధానంగా ఏఐ ప్రభావం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. టీసీఎస్ తన 5 సూత్రాల ఏఐ వ్యూహంలో భాగంగా సంస్థను పునర్వ్యవస్థీకరిస్తోంది. దీనివల్ల మధ్య స్థాయి, సీనియర్ మేనేజ్‌మెంట్ స్థానాల్లో ఉన్నవారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఒకప్పుడు వేల మందితో చేసే పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ సహాయంతో తక్కువ మందితోనే పూర్తి చేయవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే కంపెనీలు 'స్కిల్ మిస్ మ్యాచ్' పేరుతో పాత ఉద్యోగులను పక్కన పెట్టి.. న్యూ టెక్ పరిజ్ఞానం ఉన్న కొత్తవారికి ప్రాధాన్యం ఇస్తోంది.

ALSO READ : భోగి రోజు పిచ్చెక్కిస్తున్న గోల్డ్ రేటు.. 

అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒకవైపు వేల సంఖ్యలో ఉద్యోగులు తప్పుకుంటున్నా.. మరోవైపు టీసీఎస్ ఫ్రెషర్ల నియామకాలను క్రమంగా పెంచుతోంది. డిసెంబర్ త్రైమాసికంలో ఫ్రెషర్ల నియామకాలను కంపెనీ రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు ఏఐ శిక్షణ ఇవ్వడంతో పాటు, అధిక నైపుణ్యం కలిగిన కొత్త గ్రాడ్యుయేట్లను తీసుకోవడం ద్వారా తన 'నెక్స్ట్-జెనరేషన్' టాలెంట్ పూల్‌ను సిద్ధం చేసుకుంటోంది. అంటే అనుభవం ఉన్నా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అప్‌డేట్ అవ్వని వారికి ఐటీ రంగంలో జాబ్స్ రిస్కే అని స్పష్టమవుతోంది.

ALSO READ : అమర రాజా కొత్త సీహెచ్ఆర్ఓ శిల్ప

ప్రస్తుతం భారత ఐటీ రంగంలో సైలెంట్ లేఆఫ్స్ అనే కొత్త ట్రెండ్ నడుస్తోంది. కంపెనీలు అధికారికంగా ప్రకటనలు చేయకుండానే.. పెర్ఫామెన్స్ రివ్యూ, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రూల్స్ కఠినతరం చేయడం వంటి కారణాలతో ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి రాజీనామాలు చేయిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది టెక్కీలు ఈ మార్పుల వల్ల ఆందోళన చెందుతున్నారు. కేవలం కోడింగ్ తెలిస్తే సరిపోదని, ఏఐ, డేటా సైన్స్ వంటి ఇతర నైపుణ్యాలు ఉంటేనే భవిష్యత్తులో ఉద్యోగ భద్రత ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.