
హైదరాబాద్, వెలుగు: సిటిజన్లను బాగా ఆకర్షిస్తాయనుకున్న డబుల్ డెక్కర్ బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి. అసలు ఈ బస్సులు ఉన్నాయా? ఏయే రూట్లలో తిరుగుతున్నాయో కూడా చాలా మందికి తెలియదు. దీంతో వీటికి ఆదరణ దక్కట్లేదు. చాలా ఏండ్ల క్రిందటే డబుల్ డెక్కర్ బస్సులు సిటీకి ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. అప్పట్లో డబుల్‌డెక్కర్‌లో కూర్చొని సిటీ అందాలు చూసేందుకు జనం పోటీ పడేవాళ్లు. ఆ అనుభూతిని నేటి తరానికి పంచేందుకు తీసుకొచ్చిన ఈ బస్సులు ఇప్పుడు తగిన ప్రచారం లేక ఖాళీ సీట్లతో వెలవెలబోతున్నాయి. పైగా వీటి మెయింటెనెన్స్‌కు ప్రతి నెలా లక్షల్లో ఖర్చవుతుండటంతో హెచ్ఎండీఏ ఈ భారాన్ని మోస్తోంది.
నెటిజన్ల రిక్వెస్టుతో..
సిటీలో డబుల్డెక్కర్బస్సులను తిరిగి ప్రవేశపెడితే బాగుంటుందని కొందరు నెటిజన్స్నుంచి మంత్రి కేటీఆర్‌కు రిక్వెస్ట్‌లు వెళ్లాయి. దీంతో ఆ బస్సులను మళ్లీ రోడ్డెక్కించాలని ఆర్టీసీ అధికారులకు మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనపై లెక్కలు వేసుకున్న అధికారులు ప్రస్తుత సిటీ రూట్లలో వాటిని తిప్పడం సాధ్యం కాదని చెప్పారు. బస్సుల ధర కూడా ఎక్కువన్నారు. దాంతో ఈ బాధ్యత హెచ్‌ఎండీఏ తీసుకుంది. ముందుగా రెండు బస్సులను నడిపిన హెచ్ఎండీఏ తర్వాత మరో నాలుగింటిని కొన్నది. నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్మార్గ్ఏరియాల్లో తిప్పాలని డిసైడ్చేసి రెండు నెలల కిందట సర్వీసులను ప్రారంభించింది. మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ప్రతి బస్సును రెండు ట్రిప్పులు తిప్పుతున్నారు. జాయ్ రైడ్పేరిట ఫ్రీగానే తిప్పుతున్నప్పటికీ.. ప్రచారం లేకపోవడంలో ఈ విషయం తెలియని జనాలు వాటిని చూసి సంబురపడుతున్నారే తప్ప ఎక్కడం లేదు.
అధికారుల్లో లేని అవగాహన
ఒక్కో డబుల్డెక్కర్ను హెచ్ఎండీఏ రూ.2 కోట్లు పెట్టి కొన్నది. మొత్తం 6 బస్సులకు రూ.12 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో బస్మెయింటెనెన్స్కోసం నెలకు రూ.5 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని అధికారులు చెప్తున్నారు. అయితే, ఈ బస్సుల్లో ప్రయాణిస్తే టికెట్ ధర ఎంత? ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తాయి? ఏయే స్టాపుల్లో ఆగుతాయి? లాంటి సందేహాలను ఆ బస్సులను చూసినవారు వ్యక్తం చేస్తూ అసలు ఎక్కడం లేదు. ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ బస్సులను ఎక్కడెక్కడ నడపాలి, ఎంత చార్జీ వసూలు చేయాలి అనే అవగాహన అధికారుల్లోనే లేనట్లు కనిపిస్తోంది. రూట్‌మ్యాప్, స్టేజీల విషయంలోనూ క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ట్రయల్రన్చేస్తున్నామంటూ తప్పించుకుంటున్నారు.