వీవోఏల వేతనం 26 వేలకు పెంచాలి: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

వీవోఏల వేతనం 26 వేలకు పెంచాలి:   సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ముషీరాబాద్, వెలుగు: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న వీవోఏలు రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారని, కానీ వారిని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. ఐకేపీ వీవోఏ(విలేజ్ ఆర్గనైజ్ అసిస్టెంట్)ల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో మహా ధర్నా చేపట్టారు. దీనికి సీఐటీయూ గౌరవ అధ్యక్షురాలు ఎస్వీ రమ, పాలడుగు భాస్కర్ హాజరై మద్దతు తెలిపి మాట్లాడారు.

 వీవోఏలను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నేటికీ నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వం ఇస్తున్న అతి తక్కువ వేతనంతో వారి కుటుంబాలు గడవక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీవోఏల గౌరవ వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని డిమాండ్​చేశారు. వారిని సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. అనంతరం సెర్ఫ్ డైరెక్టర్ సూర్యారావును ఆయన ఆఫీసులో కలిసి డిమాండ్లను వివరించి పరిష్కరించాలని కోరారు. ఈ మహా ధర్నాకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఐకేపీ వీవోఏలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ధర్నాకు వెళ్తున్న 14 మంది వీవోఏల అరెస్ట్

శంషాబాద్: మహా ధర్నా కోసం ఇందిరాపార్కుకు బయలుదేరిన వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన ఐకేపీ వీవోఏలు 14 మందిని పెద్ద షాపూర్ వద్ద  శంషాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.  వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.  తమను ధర్నాకు వెళ్లనివ్వకుండా పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం బాధాకరమని వీవోఏలు ఆవేదన వ్యక్తం చేశారు.