ట్రాఫిక్ లో ఇరుక్కుని.. సిటీ బస్సులోనే భోజనం చేసేసిన డ్రైవర్..

ట్రాఫిక్ లో ఇరుక్కుని.. సిటీ బస్సులోనే భోజనం చేసేసిన డ్రైవర్..

దేశంలోని ప్రధాన నగరాల్లో బెంగళూరు ఒకటి.. ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. ఇది రొటీన్ అయినా.. ఇటీవల కాలంలో బెంగళూరు సిటీలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా పెరిగింది. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్ లో.. ఒక్కో సిగ్నల్ దాటాలంటే కనీసం 15 నిమిషాలు పడుతుంది అంటున్నారు వాహనదారులు.. ఈ క్రమంలోనే ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆ విశేషాలు ఏంటో చూద్దాం...

అది బెంగళూరు సిటీ బస్సు.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సిల్క్ బోర్డ్ జంక్షన్ దగ్గరకు వచ్చింది. ఫుల్ ట్రాఫిక్.. వాహనాలు ఆగిపోయి ఉన్నాయి. సిగ్నల్ దాటాలంటే కనీసం 10 నిమిషాలు అయినా పడుతుందని అంచనా వేసిన సిటీ బస్సు డ్రైవర్.. సీట్లో కూర్చుని తన లంచ్ కంప్లీట్ చేశాడు. ఇంటి నుంచి తెచ్చుకున్న లంచ్ బాక్స్ ఓపెన్ చేసి.. స్పూన్ తో తినేశాడు. ఆ తర్వాత తీరిగ్గా మంచినీళ్లు కూడా తాగాడు. స్టీరింగ్ సీట్లో కూర్చునే లంచ్ కంప్లీట్ చేసి సిటీ బస్సు డ్రైవర్ అంటూ ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

దీనిపై బెంగళూరు నెటిజన్లు విపరీతంగా స్పందించేశారు. భోజనం ఏంటీ ఏకంగా నిద్ర కూడా పోవచ్చు.. భోజనం తర్వాత కునుకు తీసినా సిగ్నల్ మాత్రం పడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో నెటిజన్ అయితే భోజనం అయితే పర్వాలేదు.. అదే వన్, టూ వస్తే.. ఇలాంటి ట్రాఫిక్ లో పరిస్థితి ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. మరో నెటిజన్ అయితే సిటీ బస్సు డ్రైవర్ భోజనం కోసం వెయిట్ చేయాలంటే.. అతను డిన్నర్ కూడా చేయలేడు అంటూ బెంగళూరు సిటీ ట్రాఫిక్ దుస్థితిని చెప్పుకొచ్చాడు. మరో నెటిజన్ అయితే ట్రాఫిక్ తగ్గాలి అంటే ఫ్లై ఓవర్లు వేయాల్సిందే అప్పటి వరకు వాహనదారులకు కష్టాలు తప్పువు అంటున్నాడు. మరికొందరు అయితే మేం రోజూ టిఫిన్ ఇంట్లో చేయం.. ట్రాఫిక్ లోనే చేస్తాం అంటూ కారులో ప్రయాణించే వాహనదారులు కామెంట్ చేస్తున్నారు.

సిటీ బస్సు డ్రైవర్.. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తన లంచ్ కంప్లీట్ చేసిన వీడియోపై అధికారులు సైతం స్పందించారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేశామని.. త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భరోసా ఇస్తున్నారు అధికారులు.