
వరద నీళ్లతో ఇబ్బందులు పడుతున్న జనాల కోసం ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, హోంగార్డులు పలుగు, పార పట్టారు. ముసారాంబాగ్ లో మురుగు కాల్వలో దిగి మట్టి తొలగించారు. ఉప్పల్ చిలుకానగర్ లో మ్యాన్ హోల్స్ క్లీన్ చేశారు. రోడ్లపై గుంతలు పూడ్చారు. వరద బాధిత ప్రాంతాల్లో చేసిన సేవలతో పోలీసులు సోషల్ మీడియాలో అందరితో శభాష్ అనిపించుకుంటు న్నారు. కానిస్టేబుళ్ల పనితీరును పోలీసు ఉన్నతాధికారులు కూడా అభినందిస్తున్నారు.
‘పొంగుతున్న మురుగు నీరు. మోకాళ్ళ లోతులో వరద. డ్రైనేజీ,మ్యాన్ హోల్ ఎక్కడో తెలియదు. దీంతో సిటీ ట్రాఫిక్ పోలీసులు అదనపు బాధ్యతలు చేపట్టారు. యూనిఫాంలోనే డ్రైనేజీలను క్లీన్ చేసి రోడ్లపై నీటిని తొలగించారు. ట్రాఫిక్ నే కాదు..కుండపోత వర్షంలో వరదను కట్టడి చేస్తామని సిటీ ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు. సిటీలో కురిసిన భారీ వర్షాల సమయంలో వీరు నిర్వహించిన బాధ్యతలకు వాహనదారులు శభాష్ అని మెచ్చుకుంటున్నారు.
సిటీలో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు ట్రాఫిక్ పోలీసులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి. వర్షంలో ఓ వైపు ట్రాఫిక్ కంట్రోలింగ్ చేస్తూనే..మరోవైపు రోడ్లపై నిలిచిన నీటిని తొలగిస్తూ జీహెచ్ఎంసీ సిబ్బందితో సమానంగా సిటీ ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించారు. సిటీలో కురిసిన భారీ వర్షాలు హోంగార్డు నుంచి ఏసీపీ స్థాయి అధికారి వరకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. వరద తాకిడికి ఛిద్రమైన రోడ్లపై వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రధాన రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తోడేయడంలో నిమగ్నమయ్యారు. ఇందులో డ్రైనేజీల మురికి నీటిని సైతం ట్రాఫిక్ సిబ్బంది తోడిపోశారు. దీంతో పాటు వర్షపు నీటితో ఏర్పడ్డ గుంతలు పూడ్చేందుకు పోలీసులు పలుగు పార పట్టారు.
ప్రధాన రూట్లలో వాటర్ లాగింగ్స్
సిటీలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఎల్బీనగర్, -చాదర్ ఘాట్,- లక్డీకపూల్,- పంజాగుట్ట,- రాజ్ భవన్ రోడ్, -ఖైరతాబాద్, -జూబ్లీహిల్స్, -బంజారాహిల్స్,- సోమాజిగూడ, -మాదాపూర్-, కూకట్‌పల్లి, మాసబ్ ట్యాంక్, పివీ ఎక్స్‌ప్రెస్ హైవే, నారాయణగూడ, అల్వాల్, లోతు కుంట, తిరుమలగిరి ప్రాంతాల్లో నిలిచిన వర్షం నీటిని తోడేసేందుకు ట్రాఫిక్ పోలీసులు నడుం బిగించారు. దీంతో పాటు బేగంపేట్ సీఎం క్యాంపు ఆఫీస్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీరు ట్రాఫిక్ పోలీసులకు సవాల్ విసిరింది. వీఐపీ జోన్ కావడంతో రోడ్లపై వరద నీటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది కంటే ముందుగానే ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా వర్షంలోనే నిల్చుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఉద్యోగుల ఆఫీస్ టైమింగ్స్ ముగిసిన సమయాల్లోనే కురిసిన కుండపోత వర్షం మరిన్ని ఇబ్బందులకు దారితీసింది. వర్షం తగ్గగానే ఒక్కసారిగా రోడ్డెక్కిన వెహికల్స్ వర్షపు నీటిలో ముందుకు వెనక్కు వెళ్లే పరిస్థితులు లేకపోయాయి. దీంతో రోడ్లపై నిలిచిన నీటిని తోడేసేందుకు ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. నీరు నిలిచిన ప్రాంతాల్లో డ్రైనేజీ ఎక్కడుందో, మ్యాన్ హోల్ ఎక్కడుందో తెలియని పరిస్థితిలో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రధాన రోడ్లలోని వాటర్ లాగింగ్ పాయింట్స్, డ్రైనేజీ పైప్ లైన్స్ గుర్తించడం,మ్యాన్ హోల్స్ రిపేర్ చేయడం లాంటి పనులు ట్రాఫిక్ పోలీసులకు అదనపు భారంగా మారింది. ట్రాఫిక్ జామ్ అయిన కొన్ని చోట్ల జీహెచ్ఎంసీ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పోలీసులే డ్రైనేజీని క్లీన్ చేశారు.
ఉన్నతాధికారుల ప్రశంసలు
వర్షపు నీరు రోడ్లమీదే నిలవడంతో తమ వంతు సామాజిక బాధ్యతగా ట్రాఫిక్ హోంగార్డ్స్ ,కానిస్టేబుల్స్ నీటిని తొలగించారు. ముసారాంబాగ్ లో నిలిచిన వర్షం నీటిని తోడేందుకు మురుగునీటి కాలువలోకి దిగిన ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వామి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. తిరుమలగిరిలో ఆర్మీ గ్రౌండ్ లో పైప్ లైన్ పగిలిపోవడంతో ట్రాఫిక్ సిబ్బంది డ్రైనేజ్ లైన్ సరిచేశారు. మరోవైపు ఉప్పల్ చిలుకా నగర్ లో మ్యాన్ హోల్స్ క్లీన్ చేసి వర్షపు నీటిని బయటకి పంపించారు. ఇలా సిటీ రోడ్లపై వర్షపు నీటితో ఏర్పడ్డ ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేశారు. రోడ్లపై గుంతలు పూడ్చి వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హైదరాబాద్,సైబరాబాద్,రాచకొండ కమిషనరేట్ లో వర్షం నీటిలో ట్రాఫిక్ విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందికి సోషల్ మీడియాలో సిటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.