- లైసెన్సులు లేకుండానే షాపుల నిర్వహణ
- రేషన్ బియ్యం అక్రమ నిల్వ, పక్కదారి
- 18 సంస్థలపై చర్యలు.. 11 ఎఫ్ఐఆర్లు
- హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో సివిల్ సప్లయ్స్ అధికారుల తనిఖీలు
హైదరాబాద్, వెలుగు: బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తూ, అధిక ధరలకు విక్రయించి దోచుకుంటున్న వ్యాపారులపై సివిల్సప్లయ్స్ శాఖ కొరడా ఝుళిపించింది. అక్రమ బియ్యం వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 18 వ్యాపార సంస్థలపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 11 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. సివిల్ సప్లయ్స్ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్ , తూనికలు-కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా అక్టోబర్ 29 నుంచి 31 వరకు రిటైల్, హోల్సేల్ బియ్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.వ్యాపారులు తూకంలోనూ, ధరల విషయంలోనూ వినియోగదారులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 25 కిలోల బియ్యం బస్తాలపై 26 కిలోలుగా లేబుళ్లు ముద్రించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అలాగే కంపెనీలు ముద్రించిన అసలు ధరలపై అధిక ధరలతో కొత్త స్టిక్కర్లు అతికించి విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది.
ట్రేడ్, జీఎస్టీ, లేబర్, ఎఫ్ఎస్ఎస్ఏఐ వంటి తప్పనిసరి లైసెన్సులు లేకుండానే పలువురు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. మరోవైపు రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, పక్కదారి పట్టించడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. నిందితులపై బీఎన్ఎస్ నిబంధనల కింద కేసులు నమోదు చేసినట్లు సివిల్ సప్లయ్స్ శాఖ వెల్లడించింది. నేర తీవ్రతను బట్టి నిందితులకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పేర్కొంది.
బియ్యం కొరత సృష్టించడం, కృత్రిమంగా ధరలు పెంచడం, తూకంలో మోసాలకు పాల్పడటం వంటి చర్యలను ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులకు నాణ్యమైన నిత్యావసర సరుకులు న్యాయమైన ధరలకు అందించేందుకు నిరంతర తనిఖీలు కొనసాగిస్తామని పౌరసరఫరాల శాఖ పేర్కొంది.
