సీఎంఆర్ బకాయిలపై సివిల్ సప్లై ఫోకస్..రైస్ మిల్లులో ఎఫ్ సీఐ బృందాల తనిఖీలు

సీఎంఆర్ బకాయిలపై  సివిల్ సప్లై ఫోకస్..రైస్ మిల్లులో ఎఫ్ సీఐ బృందాల తనిఖీలు

మెదక్, వెలుగు: జిల్లాలో లక్ష్యం మేరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సేకరణపై సివిల్ సప్లై డిపార్ట్​మెంట్ ఫోకస్ పెట్టింది. గడువులోగా సీఎంఆర్ సరఫరా చేయని రైస్ మిల్లులలో ధాన్యం నిల్వలు ఏ మేరకు ఉన్నాయనేది గుర్తించేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) ప్రత్యేక బృందాలు జిల్లాలోని ఆయా రైస్ మిల్లులలో తనిఖీలు మొదలుపెట్టాయి. 

66.72 శాతమే..

2024–- 25 వానకాలం సీజన్ లో 94 రైస్ మిల్లులకు 2,67,953 టన్నుల ధాన్యం సరఫరా చేశారు. అందుకు మిల్లర్లు 1,78,055 టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు బాయిల్డ్ రైస్ 37,030 టన్నులు, రా రైస్ 47,179 టన్నులు కలిపి మొత్తం  1,11,676 టన్నులు (62.72 శాతం) సరఫరా చేశారు. ఇది పోను 79 మిల్లుల నుంచి 66,379 టన్నుల బియ్యం బకాయి ఉంది. లక్ష్యం మేరకు సీఎంఆర్ ఇచ్చేందుకు  తగినంత ధాన్యం నిల్వలు మిల్లర్ల వద్ద లేనట్టు తెలిసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎఫ్ సీఐ రైస్ మిల్లుల నుంచి ఇంకా ఎంత మేర సీఎంఆర్ బకాయి ఉంది.

 మిల్లులో ధాన్యం నిల్వలు ఏ మేర ఉన్నాయి అనేది పరిశీలించేందుకు తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేకంగా రెండు బృందాలు ఏర్పాటు చేశారు. గురువారం నుంచి ఎఫ్ సీఐ అధికారుల బృందాలు సంబధిత రైస్ మిల్లులలో తనిఖీలు మొదలుపెట్టాయి. సంబంధిత అన్ని రైస్ మిల్లుల తనిఖీలు పూర్తి అయ్యాక ఎఫ్ సీఐ ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నారు. ఆ తర్వాత సీఎంఆర్ బకాయిల విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. 

ఈ నెల 27 వరకే గడువు

2023-–24 యాసంగి సీజన్ లో జిల్లాలోని 67 రైస్ మిల్లులకు 2,52,013 టన్నుల ధాన్యం సరఫరా చేశారు. ఇందుకు 1,70,791 టన్నుల సీఎంఆర్ సరఫరా చేయాల్సి ఉంది. ఇందులో మిల్లర్లు ఇప్పటి వరకు 1,13,007 టన్నుల బాయిల్డ్ రైస్, 31,598 టన్నుల రా రైస్ కలిపి 1,58,816 టన్నుల (92.99 శాతం) సీఎంఆర్ సరఫరా చేశారు. అది పోను ఇంకా 11,975 టన్నుల బియ్యం బకాయి ఉంది. 35 రైస్ మిల్లులు సీఎంఆర్ బకాయిలు ఉన్నాయి. సంబంధిత మిల్లర్లు ఈ నెల 27 వరకు బకాయి ఉన్న బియ్యం మొత్తం సరఫరా చేయాల్సి ఉంది.