
- 3.73 లక్షల టన్నుల నుంచి 80 లక్షల టన్నులకు అనుమతించాలి: ఉత్తమ్
- కేంద్రానికి సివిల్ సప్లయ్స్ మంత్రి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ఈ వానాకాలం సీజన్‌లో రికార్డు స్థాయిలో 80 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సన్నాహాలు జరుగుతున్నాయని సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇంత భారీ సేకరణకు కార్యక్రమానికి కేంద్రం సహకారం అవసరమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025-–26 వానాకాలం సేకరణ లక్ష్యాన్ని పెంచాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం 53.73 లక్షల టన్నులకు మాత్రమే అనుమతి ఇచ్చిన కేంద్రం.. రాష్ట్రంలో 148.30 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తున్న నేపథ్యంలో కనీసం 80 లక్షల టన్నుల సేకరణకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
సేకరణ గడువును అక్టోబర్ 31 నుండి జనవరి 31, 2026 వరకు పొడిగించాలని కోరారు. గత యాసంగిలో 74 లక్షల టన్నులు సేకరించగా, కేంద్రం 53 లక్షలకు మాత్రమే ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. ఎఫ్‌సీఐ ఓఎంఎస్‌ఎస్ కింద కిలో బియ్యాన్ని రూ.24కు అందించడంతో బియ్యం సేకరణను నిరుత్సాహపరుస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. “రాష్ట్రం నిరంతరం కేంద్ర లక్ష్యాలను అధిగమిస్తూ, వేల సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు, మిల్లింగ్ సామర్థ్యం, రవాణా-నిల్వ సదుపాయాలతో సెంట్రల్ పూల్‌కు కీలక సహకారం అందిస్తోంది. రైతుల సంక్షేమం కోసం సేకరణ టార్గెట్ పెంపు, గోదాముల నిల్వ సామర్థ్యం విస్తరణ అత్యవసరం” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రకారం కొనుగోళ్లకు రూ.20 వేల కోట్లు, బోనస్, రవాణా ఖర్చులతో కలిపి రూ.24 వేల కోట్లు నుంచి రూ.26 వేల కోట్లు అవసరం అవుతుందని తెలిపారు. సీఎంఆర్ సరఫరా గడువును కేవలం బాయిల్డ్ రైస్ రూపంలోనే ఇవ్వాలని షరతు విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. “వానాకాలం వరి రా రైస్‌కు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం 7.80 లక్షల టన్నులు రారైస్, 1.67 లక్షల టన్నులు బాయిల్డ్ మిల్లర్ల వద్ద స్టాక్ ఉంది. కాబట్టి రెండింటి సరఫరాకు అనుమతించాలి. బాయిల్డ్ రైస్ టార్గెట్‌ను యాసంగికి మార్చాలని కేంద్రాన్ని కోరాం” అని తెలిపారు.