తెలంగాణ, ఏపీ నుంచి 40 మందికి ర్యాంకులు

తెలంగాణ, ఏపీ నుంచి 40 మందికి ర్యాంకులు
  • 100 లోపు ర్యాంకుల్లో 12 మంది
  • కర్నూల్‌‌కు చెందిన యశ్వంత్‌‌కు 15వ ర్యాంకు
  • హైదరాబాద్‌‌కు చెందిన సంజనకు 37వ ర్యాంకు
  • 117వ ర్యాంకు సాధించిన స్వీపర్ కొడుకు నరేశ్
  • మల్లన్నసాగర్‌‌‌‌ ఏఈ చైతన్యరెడ్డికి 161వ ర్యాంకు
  • ఆరో ప్రయత్నంలో ఎంపికైన రిటైర్డ్ కానిస్టేబుల్ కొడుకు
  •  రోజుకు 18 గంటలు చదవి సక్సెసైన రైతు బిడ్డ అఖిల్

హైదరాబాద్ / నెట్‌‌వర్క్, వెలుగు: సివిల్స్‌‌లో తెలుగోళ్లు సత్తా చాటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌‌సీ) సోమవారం విడుదల చేసిన సివిల్స్‌‌–2021 ఫలితాల్లో 40 మందికి పైగా ఎంపియ్యారు. వందలోపు ర్యాంకుల్లో 12 మందికి పైగా తెలుగోళ్లు ఉన్నారు. తెలంగాణ టాపర్‌‌‌‌గా హైదరాబాద్‌‌కు చెందిన సంజన సింహా నిలిచారు. ఆమె 37వ ర్యాంకు సాధించారు. గతంలోనే సివిల్స్ ర్యాంక్ సాధించిన సంజన.. ఇన్‌‌కం ట్యాక్స్ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఉద్యోగం పొందారు. ప్రస్తుతం నాగ్​పూర్‌‌‌‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ర్టాల టాపర్‌‌‌‌గా కర్నూల్ జిల్లాకు చెందిన యశ్వంత్ కుమార్ రెడ్డి (15వ ర్యాంకు) నిలిచారు. మరోవైపు తెలుగు అమ్మాయిలు తమ హవా కొనసాగించారు. 

పక్షవాతమున్నా.. అమ్మ చేతి సాయంతో..

పక్షవాతంతో కుడి కాలు.. కుడి చేయి పనిచేయట్లేదు. సివిల్స్‌‌లో ర్యాంకు సాధించాలన్న లక్ష్యానికి ఇవేవీ అతడికి అడ్డుకాలేదు. తన ‘రాత’ను మార్చుకున్నాడు. తాను కష్టపడి చదవడానికి తోడు.. అమ్మ ఓ ‘చెయ్యి’ వేసి సాయం చేసింది. సినిమాను తలపించే ఈ నిజజీవిత కథ బచ్చు స్మరన్ రాజ్‌‌ది. హైదరాబాద్‌‌కు చెందిన రమేశ్‌‌కుమార్, నాగమణి దంపతుల కుమారుడు బచ్చు స్మరన్‌‌రాజ్.. మద్రాస్ ఐఐటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. హైదరాబాద్ విద్యానగర్‌‌లో నివాసం ఉంటున్నారు. తండ్రి లాయర్, డిగ్రీ చదివిన తల్లి గృహిణి. కొంతకాలంగా పక్షవాతంతో  కుడి కాలు, కుడి చేయి పనిచేయక స్మరన్‌‌రాజ్ చికిత్స తీసుకుంటున్నాడు. తండ్రి సలహా మేరకు సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నాడు. కోచింగ్ కూడా తీసుకున్నాడు. అయితే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల సమయానికి కూడా తన కుడి చేయి, కుడి కాలు పనిచేయలేదు. దాంతో తన తల్లిని స్ర్కైబ్‌‌గా నియమించుకుని పరీక్షలు రాశాడు. తాజా ఫలితాల్లో 676వ ర్యాంకు సాధించాడు. ఆరోగ్యం సహకరించకున్నా తన తల్లి సహకారంతో సివిల్స్ రాశానని స్మరన్‌‌రాజ్ తెలిపాడు. కోచింగ్, తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం తన విజయానికి తోడ్పడ్డాయని పేర్కొన్నాడు. 

డిగ్రీ నుంచే సివిల్స్ లక్ష్యంతో..

సిద్దిపేట జిల్లా జగదేవ్‌‌‌‌పూర్‌‌‌‌ మండలం నబీనగర్ ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ ధరావత్ రవీందర్ కొడుకు ధరావత్ సాయి ప్రకాశ్‌‌‌‌.. సివిల్ సర్వీస్ సాధించాలనే లక్ష్యంతో నారాయణ ఐఏఎస్ అకాడమీలో డిగ్రీ చేశాడు. 2018 నుంచి ఢిల్లీలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాడు. 2021లో సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి తొలి ప్రయత్నంలోనే 650వ ర్యాంకు సాధించాడు.

ఎలాంటి కోచింగ్ లేకున్నా..

కరీంనగర్ సిటీలోని ఆదర్శ నగర్‌‌‌‌‌‌‌‌లో ఉండే విద్యమారి రాంగోపాల్ పోలీసు శాఖలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఈయన చిన్న కొడుకు శ్రీధర్.. ఆరో తరగతి దాకా లోకల్‌‌‌‌గా వివేకానంద పాఠశాల, 7 నుంచి 10 వరకు వింద్యావ్యాలీ స్కూల్‌‌‌‌లో, ఇంటర్‌‌‌‌‌‌‌‌ నారాయణ కాలేజీలో చదివాడు. ఎంవీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ కాలేజీలో బీటెక్‌‌‌‌ ఇంజనీరింగ్‌‌‌‌ పూర్తిచేశాడు. తర్వాత చెన్నైలోని ఎల్‌‌‌‌ఆండ్‌‌‌‌ టీ కంపెనీలో 2012 నుంచి 2014 వరకు మెకానికల్‌‌‌‌ ఇంజనీర్‌‌‌‌గా ఉద్యోగం చేశాడు. అయితే సివిల్స్‌‌‌‌ సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 2015 నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. 2016 నుంచి 2019 దాకా నాలుగు సార్లు రాసినా ప్రిలిమ్స్‌‌‌‌ క్వాలిఫై కాలేదు. 2020లో ఇంటర్వ్యూ దాకా వెళ్లి వెనక్కి వచ్చాడు. ఆరోసారి ప్రయత్నంలో 336 ర్యాంక్ సాధించాడు. ‘‘సివిల్స్ కోసం ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ప్రిపేరయ్యా. మాక్ టెస్టులు అటెండ్​చేసేవాడిని. 4 సార్లు రాసినా ప్రిలిమ్స్ రాకపోయేసరికి కొంత అభద్రతా భావం కలిగింది.  మంచి ఉద్యోగం వదిలి వచ్చేశానని అనుకునే వాడిని. కానీ లక్ష్యం గుర్తొచ్చి మళ్లీ మళ్లీ ప్రయత్నించా. రోజుకు 12 గంటలు చదివే వాడిని. ఢిల్లీకంటూ వెళ్లితే ఇంటర్వ్యూ కోసమే వెళ్లాలని, అది కూడా అమ్మనాన్నను తీసుకుని పోవాలనే అనుకున్నా. సివిల్స్‌‌‌‌కు షార్ట్​కట్​లేదు. కష్టపడటం ఒక్కటే మార్గం” అని శ్రీధర్ చెప్పాడు. 

పట్టుబట్టి బెటర్​ ర్యాంక్​..  

ఎంబీబీఎస్, ఎంఎస్ పూర్తిచేశా. నాకు ఏడేండ్ల పాప ఉంది. సివిల్స్ రాయడం ఇది నాలుగోసారి. ఇప్పటికే రెండుసార్లు ర్యాంకులు వచ్చాయి. 2018లో 573వ ర్యాంకు వస్తే రైల్వేలో వచ్చింది. 2019లో 633 ర్యాంకు రావడంతో సర్వీస్‌‌లో వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో ట్రైనింగ్ తీసుకుంటున్నా. ఉదయం నుంచి రాత్రి దాకా లైబ్రరీల్లోనే గడిపాను. నా భర్త, పేరెంట్స్ సహకారంతో మంచి ర్యాంకు సాధించగలిగా. 

‑కిరణ్మయి, 56వ ర్యాంకు, హైదరాబాద్