ఏపీలో జ్యుడీషియల్ అకాడమీ ప్రారంభం

ఏపీలో జ్యుడీషియల్ అకాడమీ ప్రారంభం

    సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్ 

అమరావతి: కేసుల పరిష్కారంలో జడ్జిలు వేగంగా, సమర్థవంతంగా పనిచేయాలని సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్​  సూచించారు. ఇప్పటికే 63 లక్షల కేసుల పరిశీలనలో ఆలస్యం జరిగిందని చెప్పారు. కేసుల పరిష్కారానికి బార్ మద్దతివ్వాలని అన్నారు. శుక్రవారం ఏపీలోని అమరావతిలో ఆంధ్రప్రదేశ్  జ్యుడీషియల్​ అకడామీ ప్రారంభించి సీజేఐ మాట్లాడారు. బ్రిటిష్  వలసవాద మనస్తత్వం నుంచి ప్రజలు బయటకు రావాలని, జిల్లా కోర్టులను సబార్డినేట్ జ్యుడీషియరీగా పేర్కొనడం మానాలని కోరారు. న్యాయవ్యవస్థకు జిల్లా కోర్టులు వెన్నెముక వంటివన్నారు. మనం ఫాలో అయ్యే క్రిమినల్  జస్టిస్  సిస్టంలో బెయిల్​ కే ఎక్కువ ప్రాధాన్యం ఉంది.. జైలుకు కాదని చెప్పారు.

అయినప్పటికీ జైళ్లలో అండర్ ట్రయల్స్ ఖైదీల సంఖ్య తగ్గడంలేదని, ఇది వ్యక్తి స్వాతంత్ర్యాన్ని  హరించడమేనని జస్టిస్​ చంద్రచూడ్​ పేర్కొన్నారు. సీఆర్ పీసీ(బెయిల్) లోని సెక్షన్ 438, సెక్షన్ 439 (బెయిల్ రద్దు) లను అత్యంత జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. దేశంపై జిల్లా న్యాయవ్యవస్థల ప్రభావం ఎక్కువ అని, ఈ నేపథ్యంలో జిల్లా న్యాయవ్యవస్థలే క్షేత్ర స్థాయిలో కేసులను పరిష్కరించాలన్నారు. ఇక ముందస్తు బెయిల్, లేదా నార్మల్  బెయిల్  గ్రాంట్ విషయంలో కింది స్థాయి కోర్టుల్లో ఇప్పటికీ కొంత భయం నెలకొందన్నారు. ‘‘ కన్విక్షన్  రేటు ఆధారంగా జడ్జీల పనితీరును విశ్లేషించడం ఆపేయాలని హైకోర్టు చీఫ్  జస్టిస్​ల సమావేశంలో సూచించాను” అని సీజేఐ తెలిపారు.