ట్రిపుల్ఆర్ అలైన్మెంట్పై క్లారిటీ ఇవ్వాలి.. హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా

ట్రిపుల్ఆర్ అలైన్మెంట్పై క్లారిటీ ఇవ్వాలి.. హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా
  • ఆ తరువాతే భూసేకరణ చేపట్టాలి

    
హైదరాబాద్​సిటీ, వెలుగు: ట్రిపుల్ ఆర్​ అలైన్​మెంట్​పై స్పష్టత ఇవ్వాలని, రైతుల అనుమతి లేకుండా భూసేకరణ చేయరాదని సీపీఎం డిమాండ్​చేసింది. 2013 భూసేకరణ చట్టంలో చెప్పినట్టు మార్కెట్​ ధరకు అదనంగా నాలుగు రెట్ల పరిహారం ఇవ్వాలని, ఆ తర్వాతే భూసేకరణ చేపట్టాలని నేతలు డిమాండ్​ చేశారు. 

సోమవారం పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ, స్టేట్​ కౌన్సిల్​ మెంబర్​ డీజీ నర్సింహారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జహంగీర్​ మాట్లాడుతూ.. ప్రభుత్వం ట్రిపుల్​ఆర్​ దక్షిణ భాగంలో 345 కి.మీ. నిర్మించాలని నిర్ణయించి 20 వేల ఎకరాల భూసేకరణకు ప్లాన్​ రూపొందించిందన్నారు. మొదటి అలైన్​మెంట్​ ప్రతిపాదనలో 189.5 కి.మీ., రెండో అలైన్​మెంట్​లో 201 కి.మీ., మూడో అలైన్​మెంట్​లో 218 కి.మీలకు పెంచారని, ఇందులో ఏ అలైన్​మెంట్​ను ఫైనల్​చేశారో ప్రకటించకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. 

గతంలో ఔటర్​రింగ్​ రోడ్డు విషయంలో పలుకుబడి కలిగిన వారి భూములను సేకరించకుండా అలైన్​మెంట్​ను మార్చారని, ఇప్పుడూ అదే పద్ధతి కొనసాగుతోందన్నారు. ఉత్తర భాగంలో ఇప్పటివరకు సేకరించిన భూమికి రైతులకు మార్కెట్​ ధర ఇవ్వలేదన్నారు. ట్రిపుల్ ఆర్​ వెంట రైల్వే లైన్​ ప్రతిపాదన కూడా ఉందని, హైవే – రైల్వే లైన్​ కొంత భూమిని, రింగ్​రోడ్డుకు కలిసే జంక్షన్లకు అదనపు భూమిని సేకరిస్తున్నారని, వీటన్నింటికీ ఒక స్పష్టమైన విధానం రూపొందించి భూసేకరణపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్​ చేశారు. అనంతరం పార్టీ నాయకులు హెచ్ఎండీఏ ఉన్నతాధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు.