బీఏసీలో లొల్లి .. మంత్రి శ్రీధర్ బాబు vs హరీశ్

బీఏసీలో లొల్లి ..  మంత్రి శ్రీధర్ బాబు vs  హరీశ్

హైదరాబాద్: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కడియం శ్రీహరి హాజరయ్యారు. దీనిపై శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం తెలిపారు. బీఆర్ఎస్ తరఫున బీఏసీకి హాజరయ్యే వారి జాబితాలో విపక్ష నేత కేసీఆర్, కడియం శ్రీహరి పేర్లే ఉన్నాయని, జాబితాలో లేని వారికి అర్హత ఉండదంటూ అభ్యంతరం తెలిపారు.

 జాబితాలో పేరు లేకున్నా సభ్యుడు  అనారోగ్యంతో రాకపోయినా వేరే ఎమ్మెల్యేలను గతంలో బీఏసీకి అనుమతించామని హరీశ్ రావు చెప్పారు. ఇందుకోసం గత రికార్డులు పరిశీలించాలన్నారు. తాను చెప్పింది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.  నిన్న స్పీకర్ కు కేసీఆర్ ఫోన్ చేసి హరీశ్ రావు వస్తారని చెప్పారని హరీశ్ రావు అన్నారు.  స్పీకర్ జోక్యం చేసుకొని సర్దుకుపోవాలని సూచించారు.  ఈ క్రమంలో  హరీశ్ రావు అర్ధంతరంగా మీటింగ్ నుంచి వెళ్లిపోయారు.

 ‘స్పీకర్  రమ్మన్నారు కాబట్టే వెళ్ళాను. ఒక్క ఎమ్మెల్యే ఉన్న సీపీఐని బీఏసీ సమావేశానికి పిలిచారు’అని మీడియా పాయింట్ వద్ద హరీశ్‌రావు విలేకరులకు తెలిపారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. తాము ఎవరినీ వ్యక్తిగతంగా బీఏసీ నుంచి బయటికి వెళ్లమని కోరలేదన్నారు. స్పీకర్‌ నిర్ణయం మేరకే బీఏసీ నడిచిందని, పార్టీల నుంచి ముందుగా ప్రతిపాదించిన సభ్యులే బీఏసీకి రావాలని స్పీకర్‌ కోరారని చెప్పారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ ను ఎన్నుకున్నా.. ఆయన అసెంబ్లీకి రావడంపైనే క్లారిటీ లేదు. అసలు అసెంబ్లీకే రాని ఎల్పీ నేతతో ఉపయోగం ఏంటన్న చర్చ బీఆర్ఎస్ లో జరుగుతోంది. ఒకరకంగా ఇది సొంత పార్టీ నుంచే హరీశ్ కు జరిగిన అవమానమని పార్టీ నేతలు కామెంట్ చేశారు.