అగ్గిపెట్టె విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

అగ్గిపెట్టె విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
  • కర్రతో తలపై కొట్టడంతో ఒకరు మృతి

రాయపర్తి, వెలుగు : అగ్గిపెట్టె విషయంలో తలెత్తిన వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసి ఒకరి చావుకు కారణమైంది. వరంగల్  జిల్లా రాయపర్తి మండలం కొలన్ పల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాయపర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పర్వతగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన బేతి రాంచరణ్ (17) కొద్ది రోజుల కింద సంక్రాంతి పండుగకు తన పెద్దమ్మ ఇల్లు రాయపర్తి మండలం కొలన్ పల్లి గ్రామానికి వచ్చాడు. ఈనెల 15న గ్రామంలోని కొందరు యువకులతో మద్యం సేవించేందుకు వెళ్లాడు. అదే సమయంలో మద్యం తాగేందుకు మరో గ్రూప్ వచ్చింది.

మొదటి గ్రూపులోని వ్యక్తి రెండో గ్రూపు వ్యక్తులను అగ్గిపెట్టె అడిగాడు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. రెండో గ్రూప్  వ్యక్తి రాంచరణ్ ను కర్రతో కొట్టడంతో గాయపడ్డాడు. దీంతో మొదటి వర్గం వ్యక్తులు బాధితుడిని అతని పెద్దమ్మ ఇంట్లో వదిలిపెట్టారు. మద్యం సేవించి ఉన్నాడని వారు అనుకున్నారు. ఉదయం లేవకపోవడంతో బాధితుడిని వరంగల్  లోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.