టీజీవో ఎన్నికల్లో లొల్లి .. నామినేషన్లు స్వీకరించకుండా డోర్ లాక్

టీజీవో ఎన్నికల్లో లొల్లి ..  నామినేషన్లు స్వీకరించకుండా డోర్ లాక్

హైదరాబాద్: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. ఎల్బీనగర్ లోని పల్లవీగార్డెన్స్ లో ఇవాళ నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద  సంఖ్యలో గెజిటెడ్ అధికారులు తరలివచ్చారు. అయితే కొందరు ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం నామినేషన్లు స్వీకరించకుండా డోర్ లాక్ చేశారు. దీంతో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల్లో చిల్లరగా వ్యవహరిస్తున్నారంటూ సభ్యులు మండిపడుతున్నారు. ఎన్నికలు నిర్వహించకుండా ఏకగ్రీవం అంటే తాము ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోబోమని చెబుతున్నారు. 

తొలిసారిగా ఎన్నికలు

రాష్ట్రంలో తొలిసారిగా టీజీవో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఏడు పదవులకు ఈ ఎలక్షన్ జరగనుంది. ఈ ఎన్నికల నిర్వహణకు ఆర్డీవో, కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ ను ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్స్ గా ప్రభుత్వం నియమించింది. మొత్తం ఏడు పదవులకు మాత్రమే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 12,500 మంది గెజిటెడ్ ఉద్యోగులు ఉండగా 9 వేల మెంబర్ షిప్ పూర్తయింది.  ఒకటే అసోసియేషన్ ఉండాలన్న ప్రభుత్వం సూచన మేరకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. పదేండ్లుగా మాజీ మంత్రి ఆదేశాలతో ఎలాంటి ఎన్నికలు లేకుండా టీజీవో ఏకఛత్రాధిపత్యంగా నడిచింది. లోక్ సభ ఎన్నికల తర్వాత 33 జిల్లాల కమిటీలతో పాటు హైదరాబాద్ నగర కమిటీ కూడా ఏర్పడనుంది.