GHMC కౌన్సిల్.. రచ్చ రచ్చ ..మొదటి నుంచి లంచ్ బ్రేక్ దాకా లొల్లే

GHMC కౌన్సిల్.. రచ్చ రచ్చ ..మొదటి నుంచి లంచ్ బ్రేక్ దాకా లొల్లే
  • ఆందోళనలు, వాయిదాల మధ్య కొనసాగింపు  
  • వందేమాతరం పాడబోమన్న ఎంఐఎం కార్పొరేటర్లు 
  • బీజేపీ వాళ్లు దేశం విడిచి వెళ్లాలంటున్నారని ఆందోళన
  • బ్రేక్ తర్వాత చెత్త సమస్యపైనే చర్చ

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆఖరి సమావేశం మంగళవారం ఆందోళనలు, వాయిదాల మధ్య కొనసాగింది. లంచ్ బ్రేక్ వరకు వరుసగా ఆయా పార్టీల కార్పొరేటర్ల మధ్య గొడవలతో సభలో ఉద్రిక్తత నెలకొంది. 11.04 గంటలకు సమావేశం ప్రారంభం కాగా కవి అందెశ్రీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ ముజాఫర్ హుస్సేన్ మృతి పట్ల సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. 11.19 గంటలకు టీ బ్రేక్​తో పాటు ఫొటో సెషన్ కోసం బ్రేక్ ఇచ్చారు. 12.41 గంటలకు సమావేశం మొదలైంది.

వందేమాతరంపై లొల్లి

బీజేపీ మెదక్​ఎంపీ రఘునందన్ రావు వందేమాతరం గీతం150 ఏండ్లు పూర్తయిన సందర్భంగా సభలో గేయం అలపించాలని కోరారు. దీంతో వందేమాతరంతో పాటు రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ ను అలపించాలని మేయర్  కౌన్సిల్ లో ప్రకటించడంతో పాటు అలపించారు. అయితే, తాము వందేమాతరం పాడబోమని ఎంఐఎం కార్పొరేటర్లు వ్యతిరేకించారు.

 గీతం మొదలైనా పలువురు ఎంఐఎం కార్పొరేటర్లు కుర్చీల్లోంచి లేవలేదు. వందేమాతరం తర్వాత ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆలపించగా, ఈ సమయంలోనూ కొందరు ఎంఐఎం కార్పొరేటర్లు కూర్చొనే ఉన్నారు. అయితే, వందేమాతరం పాడని వారు దేశాన్ని విడిచివెళ్లాలని కొందరు బీజేపీ కార్పొరేటర్లు అంటున్నారని ఎంఐఎం కార్పొరేటర్ల ఆందోళనకు దిగారు. 

ఇదే విషయమై ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్లు గొడవ పడ్డారు. టేబుల్స్ ఎక్కి మరీ ఒకరిపై ఒకరిపై పోటీపడి తోసుకుంటూ నినాదాలు చేసుకున్నారు. దీంతో మార్షల్స్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అప్పుడు సమయం 1.16 గంటలవుతుండడంతో మేయర్ 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చారు. తిరిగి 1.25 గంటలకు కౌన్సిల్​ప్రారంభమైంది. 

‘ఐలా’... అలా ఎలా? 

సమావేశం మొదలు కాగానే వెంటనే సనత్​నగర్​ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఐలాకి సంబంధించిన భూముల ప్రస్తావన తీసుకొచ్చారు. పారిశ్రామికవాడల్లోని ప్రజలు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇండస్ట్రియల్ ట్రాన్స్ ఫార్మింగ్ పేరుతో జీవో ఇచ్చిందన్నారు. దీనివల్ల బాలానగర్, జీడిమెట్ల, కాటేదాన్, కుషాయిగూడ, చర్లపల్లి, ఉప్పల్ పారిశ్రామిక వాడల్లో భూములను అప్పనంగా అప్పగించేందుకు ప్రభుత్వం ఈ జీవో ఇచ్చిందన్నారు.

 దీన్ని కాంగ్రెస్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ‘ఈ అంశంపై మనం అసెంబ్లీ లేదా శాసనమండలిలో చర్చిద్దాం’ అని అన్నారు. మేయర్ కూడా ఎజెండాలో లేని అంశాన్ని ఎలా చర్చిస్తామని నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. పలువురు కార్పొరేటర్లు సీఎం డౌన్ డౌన్ అంటూ పోడియం చుట్టుముట్టారు. వీరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్పొరేటర్లు పోటాపోటీ నినాదాలు చేశారు. 

నిజమే.. పారిశుధ్య సిబ్బంది డ్యూటీలు చేస్తలేరు 

శానిటేషన్​కు సంబంధించిన ప్రశ్నపై అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ సమాధానాలిచ్చారు. 1578 మంది వర్కర్లని తీసుకునేందుకు ప్రభుత్వం నుంచి  మే  23న అనుమతి వచ్చిందని, జోనల్ స్థాయిలో రిక్రూమెంట్ జరుగుతుందన్నారు. 678 మంది రిక్రూట్ చేశామని,  వచ్చేనెలాఖరు వరకు భర్తీ పూర్తవుతుందన్నారు. తర్వాత మిగిలిన ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. 

జీపీపీ పాయింట్లను తొలగించేందుకు వెయ్యి డస్ట్ బిన్లను ఏర్పాటు  చేయించామని, మరో వెయ్యి ఏర్పాటు చేయాలని రాంకీకి సూచించామన్నారు. 27 టూరిస్ట్ స్పాట్లలో చెత్త నిర్వహణను రెండు సంస్థలు చూసేవని, వారి కాలపరిమితి అయిపోయిందని, త్వరలో కొత్త టెండర్లు పెడుతున్నామన్నారు. గ్రేటర్ లో 18,557 మంది సిబ్బంది ఉంటే 17,655 మంది పని చేస్తున్నారని, 2365 పర్మినెంట్ వర్కర్లు ఉన్నారన్నారు. 

సిబ్బంది డ్యూటీలకు రావడం లేదన్నది నిజమేనన్నారు. ఈ సమస్య పరిష్కారానికి జరిమానా వేసే పద్ధతిని అవలంభిస్తామన్నారు. సీఆర్ఎంపీ రోడ్లపై 20 స్వీపింగ్ మెషీన్లు , నాన్ సీఆర్ఎంపీ రోడ్లపై 18 యంత్రాలతో స్వీపింగ్ జరిపేదని, ఈ ఏడాది జూన్ 30తో గడువు పూర్తయ్యిందన్నారు. సీఆర్ఎంపీ ఫేజ్ -2 కింద తీసుకునేందుకు  ప్రభుత్వ అనుమతి కోసం వెయిట్  చేస్తున్నామన్నారు. అప్పటి వరకు ఇబ్బందులు లేకుండా ఉన్న సిబ్బందితో క్లీనింగ్ చేయిస్తున్నామన్నారు. 

డివిజన్​కు రూ.2 కోట్ల నిధులు  

వచ్చే ఏడాది ఫిబ్రవరి10తో ప్రస్తుత కౌన్సిల్ గడువు ముగియనుండడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా డివిజన్ల అభివృద్ధికి ఒక్కో కార్పొరేటర్ కి రూ.2 కోట్లు కేటాయిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. రూ.కోటి  కార్పొరేటర్ ప్రత్యక్షంగా ప్రతిపాదించే పనులకు వినియోగించుకోవచ్చని,  మరో రూ.కోటి  జిల్లా ఇన్‌చార్జ్ మంత్రితో సమన్వయం చేస్తూ కార్పొరేటర్ ప్రతిపాదించే పనులకు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

 నిధులను రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, కాలుష్య నియంత్రణ, వర్షపు నీటి కాల్వలు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్, పబ్లిక్ సౌకర్యాల అభివృద్ధి వంటి అత్యవసర   సదుపాయాల మెరుగుదలకు వినియోగించాల్సిందిగా సూచించారు. సీఎం రేవంత్ రెడ్డిని అడగగానే  నిధులు కేటాయించేందుకు ఒప్పుకున్నారని, సభ తరపున సీఎంకు మేయర్ ధన్యవాదాలు తెలిపారు.

లంచ్ బ్రేక్ తరువాత ఒక్క ప్రశ్నపైనే చర్చ.... 

లంచ్ బ్రేక్ తర్వాత 2.52 గంటలకు సమావేశం తిరిగి ప్రారంభమైంది. క్వశ్చన్​అవర్​ ప్రారంభం కాగా, శానిటేషన్​పై ఎంఐఎం కార్పొరేటర్ సోహెల్ ఖాద్రీకి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. అయితే ఆయన స్పోర్ట్స్ పై మాట్లాడారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లలో కోచ్ లు లేరని చెప్తుంటే పట్టించుకోవడం లేదన్నారు. 

చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మాట్లాడుతూ 150 డివిజన్లలో స్పోర్ట్స్ కోచ్ లు లేరని, నియమించాలని కోరారు. అమీర్ పేట్ కార్పొరేటర్ మాట్లాడుతూ.. 60 ఏండ్ల  జీహెచ్ఎంసీ వర్కర్ పై లైంగికదాడి జరిగిందని, ఆమె బయటకు రాలేకపోతోందని చెప్పగా, ఆమె ఇంట్లో వారికి ఉద్యోగం కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. 

పదేండ్ల పాటు సస్పెండ్​ చేయాలి: బీజేపీ

వందేమాతర గీతం ఆలపించిన సమయంలో రెస్పెక్ట్ ఇవ్వని సభ్యులను పదేండ్ల పాటు పోటీ చేయకుండా నిషేధించాలని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి అన్నారు. సభలో అల్లా హు అక్బర్ అంటూ చిత్ర, విచిత్రంగా ప్రవర్తించారన్నారు. డివిజన్ల కు కేటాయించిన రూ. 2 కోట్లు ఎక్కడా సరిపోవని, తక్కువ జనాభా ఉన్న డివిజన్లుకు, ఎక్కువ జనాభా ఉన్న డివిజన్లకు రెండు కోట్లు ఇస్తే ఎలా సరిపోతాయన్నారు.